సెలెక్ట్ కమిటీ ఉందో లేదో తెలియని మీమాంస ఎదురైంది. మూడు రాజధానులు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల భవిష్యత్తేమిటో తెలియని ఆగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. టిడిపి పట్టువీడకుండా చైర్మన్ నిర్ణయమే తుది నిర్ణయమని అంటుంటే, ప్రభుత్వం కమిటీ ఎక్కడుందని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. శాసనసభలో బిల్లులను ఆమోదించి మండలికి పంపారు. విచక్షణాధికారం పేరుతో మండలి చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఈ పరిణామాలపై ఆగ్రహం చెంది, చివరకు శాసనమండలినే రద్దు చేయాలనే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. రాష్ట్రపతి తుది నోటిఫికేషన్ జారీ అయ్యేవరకు మండలి పనిచేస్తుందని, అదేవిధంగా సెలెక్ట్ కమిటీ ఉంటుందని టిడిపి వాదన. మండలి చైర్మన్ గణతంత్ర దినోత్సవం నాడు రెండ్రోజుల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుంచి పేర్లనుకోరారు.
పార్టీలిచ్చిన పేర్లతో రెండు కమిటీ లను సిద్ధం చేశారు. ఐతే ప్రభుత్వం నుంచి మంత్రులు ఈ కమిటీలకు చైర్మన్ గా ఉండాల్సి ఉంటుంది. అందుకు ఆయా మంత్రులు ససేమిరా వీల్లేదంటున్నారు. అసలు ప్రభుత్వం మాత్రం కమిటీల ప్రస్తావన లేదని తేల్చి చెబుతుంది. జనవరి 22న మండలి చైర్మన్ తీసుకున్న సెలెక్ట్ కమిటీ నిర్ణయం ఇప్పటి వరకూ అమలు కాలేదు. అసలు అమలవుతుందా లేదా అనేది ఇప్పుడు ఎపి మొత్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ వైఖరి స్పష్టమైనప్పటికీ నిబంధనలకు వ్యతిరే కంగా మండలి రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. శాసనమండలి చైర్మన్ సరైన నిర్ణయం తీసుకోలేదని, అదితప్పు అని, నిబంధనలకు వ్యతిరేకమంటూ మండలి కార్యదర్శికి లేఖలు రాశారు. ఓవైపు మండలి చైర్మన్ ఆదేశాలు తప్పుకాదని విచక్షణాధికారం ఉంటుందని టీడీపీ అంటోంది. గత కొద్ది రోజుల నుంచి అధికారులు ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.
చైర్మన్ మాత్రం కమిటీలు ఏర్పాటవుతాయంటూ జనవరి 26న స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కమిటీల విషయంలో అటు టిడిపి.. బిజెపి.. పిడిఎఫ్ సభ్యుల పేర్లను అందించింది. ప్రభుత్వం నుంచి మంత్రులు లేకుండా కమిటీల ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిబంధనలు పక్కనబెట్టి టిడిపి అధినేత ఒత్తిడి మేరకు సెలెక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారనేది ప్రభుత్వ వాదన. ఈ విషయంలో రాజీపడకూడదని నిర్ణయించింది. అదే సమయంలో సాధ్యమైనంత త్వరగా మండలి రద్దు చేసేలా కేంద్రంతో సంప్రదింపులు చేయాలని భావిస్తోంది. మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లకుంటే మండలి రద్దయ్యేవరకు ప్రభుత్వం వేచి చూడాల్సి ఉంటుందని ఆతర్వాత అసెంబ్లీలో ఆమోదం పొందడంతో తాము అనుకున్న విధంగా ముందుకు వెళ్లే అవకాశముంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మండలి కార్యదర్శి కూడా అందుకు సంబంధించిన ఫైల్‌ను తిరిగి ఛైర్మన్‌కు పంపారు. దీంతో అసలు ఇప్పుడు కొనసాగుతున్న ప్రతిష్ఠంబనతో ఈ రెండు బిల్లుల భవిష్యత్తేమిటి, ఈ మొత్తం వ్యవహారానికి ముగింపు ఏమిటనే చర్చ అటు అధికార వర్గాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ కొనసాగుతోంది.