ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. మన రాష్ట్రానికి చేసిన అన్యాయానికి, అడ్రస్ లేకుండా పోయారు. 130 ఏళ్ళ పార్టీకి, సున్నా సీట్లు ఇచ్చారు ఆంధ్రులు. అయితే, ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. నరేంద్ర మోడీ చేసిన అన్యాయానికి, కొంత మంది కాంగ్రేసే నయం అంటున్నా, చెప్పోకోదగ్గ స్థాయిలో ఏమి పుంజుకోలేదు. అయితే, ఇప్పుడు ఇలాంటి పార్టీలో టికెట్ కోసం, ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు ఒకతను. నెల్లూరు రూరల్ కాంగ్రెస్ టిక్కెట్ కోసం పీసీసీ సభ్యుడు శివాచారి ఆత్మహత్యాయత్నం చేశారు. కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ ఘటన జరిగింది. శివాచారి ఆత్మహత్యాయత్నాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... గురువారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
నెల్లూరు జిల్లాకు చెందిన శివాచారి సమావేశం మధ్యలో అరుపులు, కేకేలతో సభ మధ్యలోకి దూసుకు వచ్చి.. తనకు అన్యాయం చేస్తున్నారని, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ, ఆమె భర్త తనను పార్టీలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలో తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. తనతోపాటు పురుగులమందు డబ్బా తీసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన నేతలు, కార్యకర్తలు శివాచారి చేతిలో ఉన్న డబ్బాను తీసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెండు దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎంతో సేవ చేశానని, నెల్లూరు జల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్న తనను పనబాక దంపతులు అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని, పదవి కూడా ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తనకు కనుక అన్యాయం జరిగితే నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని శివాచారి స్పష్టం చేశారు. అయితే ఈ చర్య పై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకే అడ్రస్ లేకపోతే , ఇక ఇలాంటి వారు టికెట్ ల కోసం చచ్చిపోవటం ఏంటో అర్ధంకాక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.