ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతుంది. ఇప్పటికే జనసేన, కమ్యూనిస్ట్ పార్టీ పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయి. అలాగే జగన్, బీజేపీ, అంతర్గత పొత్తు వ్యూహాలు నడుస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో, మోడీని ఎదుర్కుంటానికి, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర స్థాయిలో ఏమి చేస్తుందా అనే చర్చ మొదలైంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పై, ఇప్పటికీ కోపం ఉన్నా, నమ్మించి మోసం చేసిన మోడీ పై, దానికి పదింతలు కోపం ప్రజల్లో ఉంది. మరో పక్క కాంగ్రెస్ ప్రత్యెక హోదా హామీ కూడా ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి సంతకం హోదా పైనే, అంటూ రాహుల్ చెప్పారు. అయితే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు పై చర్చ నడుస్తుంది. కాంగ్రెస్, తెదేపా ఏపీలో మాత్రం పొత్తు పెట్టుకునే అవకాశాలు కన్పించడంలేదు.
చంద్రబాబు, రాహుల్‌గాంధీ ఈ మేరకు తమ పార్టీల నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్రాల్లో విడిగా పోటీ చేసినా దేశ ప్రయోజనాల కోసం కేంద్రంలో భాజపాకు వ్యతిరేకంగా కలిసి నడవాలని నిర్ణయానికి వచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన ఈ బంధం క్రమంగా భాజపాయేతర కూటమి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ జతకలిశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూటమి బలోపేతం దిశగా రాహుల్‌గాంధీ, చంద్రబాబు పలుమార్లు సమావేశమయ్యారు. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న భావన ఇరుపార్టీల శ్రేణుల్లో నెలకొంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ప్రజల మనోభావాలకు తగట్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో పొత్తులు లేకున్నా ఏపీ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో భాజపాయేతర కూటమికి అన్ని పార్టీలు మద్దతు పలకాలన్నారు. రాహుల్‌గాంధీ కూడా ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
దిల్లీ పర్యటనలో రాహుల్‌గాంధీతో సమావేశమైన చంద్రబాబు ప్రతిపక్షాల ఐక్యతపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో పొత్తు గురించే కాకుండా జాతీయస్థాయిలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రస్తుతం చరిత్రాత్మక అవసరమనే అభిప్రాయానికి నేతలు ఇద్దరూ వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ వ్యతిరేక విధానాల నుంచి పుట్టిన పార్టీ అయినందున రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే తెదేపాకు ఇబ్బంది అవుతుందేమోనన్నది పార్టీ వర్గాల ఆలోచన. బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్‌ది ఇదే పరిస్థితి. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో, కేరళలో సీపీఎంతో కాంగ్రెస్‌కు సఖ్యత సరిగా లేనందున రాష్ట్రాల్లో పొత్తులకు పోయి నష్టపోవడం కన్నా జాతీయస్థాయిలో ఐక్యంగా ఉండడం సబబు అనే నిర్ణయానికే రాహుల్, చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.