సహజంగా చంద్రబాబు పై ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇక పోలీస్ శాఖలో అయితే అది మరీ ఎక్కువ ఉంటుంది. ఇదంతా చంద్రబాబు ఎక్కువ పని చెయ్యమంటారు, మా మీద ఒత్తిడి ఉంటుంది అని, అందుకే చంద్రబాబు అంటే వ్యతిరేకం అని బహిరంగంగానే చెప్తూ ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా నిన్న ఒక కానిస్టేబుల్, ఎంతో ఎమోషనల్ గా చేసిన ప్రసంగం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు చేసిన మంచికి, పోలీస్ శాఖ నుంచి వస్తున్న ప్రశంస ఇది. ఇటీవల పోలీస్ శాఖలో ఉద్యోగోన్నతి పొందిన సిబ్బంది సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగోన్నతి ఇచ్చిన ముఖ్యమంత్రిపై పోలీసు సిబ్బంది ప్రశంసలు జల్లు కురిపించారు. ఆయన రుణం తీర్చుకోలేనిదన్నారు. వృత్తిలో ఉద్యోగోన్నతి పొందలేమనే తమకు పదోన్నతులు ఇచ్చి జీవితంలో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించారని ప్రశంసించారు.
ఉద్యోగోన్నతి పొందిన పలువురు సిబ్బంది తన మనసులోని మాటలను సభావేదికపై వివరించారు. అరుంధతీ నక్షత్రంలా ఏఎస్సైల భుజాలపై ఒక నక్షత్రం పెట్టారని, హెడ్‌కానిస్టేబుళ్ల భుజాలపై మూడు పట్టీలను చంద్రన్న కానుకగా ఇచ్చారన్నారు. మరో కానిస్టేబుల్ మాట్లాడుతూ పాతికేళ్లకిందట తాను పాఠశాలకు వెళ్లకుండా రోడ్డు మీదకు తిరుగుతుంటే మంత్రి హోదాలో ఉన్న చంద్రబాబునాయుడు తనను ఆపితే తమకు పాఠశాల లేదని ధైర్యంగా చెప్పానన్నారు. ఆ రోజు చంద్రబాబునాయుడు చొరవతో ఏర్పాటు చేసిన పాఠశాలలో చదువుకుని తాను కానిస్టేబుల్ ఉద్యోగం సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను వివరించిన పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘పోలీసు వ్యవస్థలో కానిస్టేబుళ్లకు కొత్త శక్తినిస్తున్నాం. మొత్తం 3,151 మందికి పదోన్నతులు కల్పించాం. తిరుపతిలో వీరేష్ అనే బాలుడు కిడ్నాప్ అయితే 48 గంటల్లోనే టెక్నాలజీ సాయంతో ఛేదించి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడం ఏపీ పోలీసుల సమర్థతకు నిదర్శనం. ఇప్పుడు పదోన్నతులు రావడంతో మీలో కనిపించిన ఆనందం శాశ్వతంగా ఉండాలి. సివిల్ పోలీసులతోపాటు ఏఆర్, మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించే బాధ్యతనూ తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హోంమంత్రి చినరాజప్ప మాట్లాడారు. ‘రాష్ట్రంలో 60వేల మంది పోలీసులు, వారి కుటుంబాల్లోని 3 లక్షల మంది, మా అందరి బంధువులు మరో ఆరేడు లక్షల మంది మొత్తం సుమారు 10 లక్షల మంది మీకు (ముఖ్యమంత్రి) రుణపడి ఉంటాం’ అని ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు.