రాష్ట్రంలో ఇసుక కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపుగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, గత అయుదు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి దాకా ఎలాగోలా అప్పులతో నెట్టుకొచ్చిన వారు, ఇప్పుడు అప్పులు కూడా పుట్టక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది బాధలు తట్టుకోలేక, బలవంతపు మరణాలకు కూడా వెనుకాడటం లేదు. అన్ని రాజకీయ పార్టీలు, ఇసుక పై పోరాటం చేస్తున్నాయి. ఒక పక్క తెలుగుదేశం, మరో పక్క జనసేన, మరో పక్క బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, ఇసుక కొరత పై ప్రతి రోజు, ఏదో ఒక ఆందోళన కార్యక్రమం చేస్తూనే ఉన్నాయి. ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ ఆధ్వర్యంలో, విజయవాడలో ఆందోళన జరుగుతుంది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ జరిగింది. అలాగే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, ప్రతి రోజు ఆందోళన చేస్తూనే ఉంది. ఎంత మంది ఎన్ని చేసినా ప్రభుత్వం మాత్రం దిగి రావటం లేదు.
అయితే ఈ ఇసుక వేడి, మంత్రులకు కూడా తగులుతుంది. వివిధ పర్యటనలకు వెళ్తున్న మంతుల్రను, ఎక్కడికక్కడ, నిలదీస్తున్నారు, భవన నిర్మాణ కార్మికులు. తాజగా నెల్లూరు నగరంలో ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సోమవారం ఉదయం మంత్రి అనిల్ నెల్లూరు నగరంలో పర్యటన చేసారు. అయితే అనిల్ పర్యటనను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని అన్నారు. తినటానికి తిండి కూడా ఉండటం లేదని, ప్రతి రోజు పస్తులతో ఉంటూ, ఇంట్లో పిల్లలను కూడా పస్తులు ఉంచుతున్నామని మంత్రి అనిల్ పై,భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ వాదనలు జరుగుతున్న సమయంలో, కార్మికులకు నచ్చజెప్పేందుకు అనిల్ కుమార్ ప్రయత్నించారు. త్వరలోనే మీ కష్టాలు తీరిపోతాయని, మరో వారం పదిరోజుల్లో ఇసుక సమస్యను, జగనన్న పరిష్కరిస్తారాని, ఈ సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం తనకు ఉందని, కార్మికులకు అనిల్ హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరినీ జగనన్న చక్కగా చూసుకుంటారని, ఎవరికీ కష్టం లేకుండా చూసుకుంటారని, కొన్ని తాత్కాలిక ఇబ్బందులు తప్పవని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న పవన్ కళ్యాణ్ చేసిన, లాంగ్ మార్చ్ పై, విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్క్రిప్ట్ చదివారు అంటూ, ఎద్దేవా చేసారు.