రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 87కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే 43 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ వెల్లడించింది. కడప జిల్లాలో 15 మందికి కరోనా సోకింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ 14 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఇవాళ 5 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాలో ఇవాళ 4 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో ఇవాళ 2 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ 2 కరోనా కేసులు నమోదు కాగా... విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఇవాళ ఒక్కో కేసు నమోదయ్యాయని వైద్యశాఖ వెల్లడించింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 మందికి కరోనా సోకింది. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు వైద్యఆరోగ్య శాఖ నివేదికను వాట్సాప్ ద్వారా వెల్లడించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా సోకిన బాధితుల సంఖ్య 87కి చేరింది. ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు, పెనుగొండలో రెండు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. వైద్యపరీక్షల్లో 14 పాజిటివ్, 10 నెగిటివ్, ఇంకా 6 నివేదికలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే కరోనా పాజిటివ్ కేసుల సమాచారం ఇంకా వైద్యఆరోగ్యశాఖ ధ్రువీకరించాల్సిఉంది. దేశ రాజధానిలో మత ప్రార్థనలకు హాజరై రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు వెయ్యికి పైగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ సంఖ్య చూసి రాష్ట్రం ఉలిక్కిపడింది. దిల్లీ వెళ్లొచ్చిన వారు లాక్డౌన్ ప్రకటించే నాటికే స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం, వాటికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరవడం మరింత కలవరపాటుకు కారణమవుతోంది. రాష్ట్రంలోని పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.
కార్మికులు, కూలీలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. రైతుబజార్ల సంఖ్యను పెంచుతున్నామన్న మంత్రి బొత్స... సంచార దుకాణాల ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నామని వివరించారు. ఎవరికి అనుమానిత లక్షణాలున్నా వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నామని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, క్వారంటైన్లలో వసతులు పెంచాలని సీఎం ఆదేశించినట్టు బొత్స తెలిపారు. నియోజకవర్గ స్థాయిలోనూ అత్యవసర ఏర్పాట్లు చేశామని చెప్పారు. అరటి, టమాటా, అరటి, బత్తాయి పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు బొత్స సత్యనారాయణ వివరించారు.