రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో ప్రకాశం లో 11, గుంటూరు లో 2 , తూర్పు గోదావరి మరియు కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 15 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 363 కి పెరిగింది. చిత్తూరు జిల్లా లో ఈ రోజు ఒక కోవిడ్ పాజిటివ్ పేషెంట్ డిశ్చార్జ్ చేయబడ్డాడు. దీనితో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 10 కి పెరిగింది. రాష్ట్రం లో ఈ రోజు కోవిడ్ వల్ల అనంతపూర్ మరియు గుంటూరు జిల్లాలో ఒక్కో మరణం నమోదైనట్లు ధృవీకరించబడింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మరణించారు. అత్యధికంగా, 75 కేసులతో, కర్నూల్ జిల్లాలో అధిక కేసులు ఉన్నాయి. అనంతపురంలో 13 కేసులు, చిత్తూరు జిల్లాలో 20 కేసులు, తూర్పు గోదావరిలో 12 కేసులు, గుంటూరు జిల్లాలో 51 కేసులు, కడపలో 29 కేసులు, నెల్లూరులో 48 కేసులు, ప్రకాశంలో 38 కేసులు, విశాఖలో 20 కేసులు, పశ్చిమ గోదావరిలో 22 కేసులు రాగా, శ్రీకాకుళం, విజయనగరంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా రాలేదు.
ఇక మరో పక్క, విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉదయం 6 నుంచి ఉదయం 9 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నట్లు.. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పదేపదే పోలీసులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు ఏదో కారణంతో రోడ్లపైకి వస్తున్నారన్న ఆయన... ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకుని తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే చాలామంది గుంపులుగా తిరుగుతున్నారన్న ఆయన... చాలామంది భౌతికదూరం పాటించడం లేదని తమ దృష్టికి వస్తోందని తెలిపారు. మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ నేతలు కూడా నిబంధనలు పాటించాలని కోరారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
ఇది ఇలా ఉంటే, రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా అనేకచోట్ల వర్షాలు కురిశాయి. కృష్ణాజిల్లాలో అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆరు బయట ఆరబెట్టిన పసుపు కొమ్ములు, మొక్కజొన్న గింజలు నీటిపాలవ్వడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మోపిదేవి మండలం చిరువోలులో పిడుగుపాటుకు ఓ గడ్డివాము దగ్ధమైంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగిడిపాలేనికి చెందిన ఓ రైతు పిడుగుపాటుకు మృతి చెందాడు. పంట తడవకుండా పట్టాలు వేస్తుండగా పిడుగుపడటంతో.. రైతు అక్కడికక్కడే మరణించాడు. చేబ్రోలు మండలంలోని పలు గ్రామాల్లో.... పొలాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు.