రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 7,320 నమూనాలు పరీక్షించగా... కొత్తగా 54 మందికి కరోనా నిర్ధరణ అయ్యినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 1,887కు ఎగబాకింది. వైరస్ బారిన పడి ఇవాళ కర్నూలు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 41కి చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని 842 మంది డిశ్ఛార్జి అయ్యారు. 1,004 కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా మరో 54 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గత పది రోజులతో పోల్చుకుంటే, ఈ రోజే తక్కువ. అయితే కేసులు తగ్గుతున్నయాని, సంతోషించినా, ఇక్కడ మరో కలవర పెట్టే విషయం ఏమిటి అంటే, మొన్న పది రోజుల నుంచి ఎక్కువగా కేసులు వస్తున్నా, అవి కృష్ణా, గుంటూరు, కర్నూల్ నుంచే ఎక్కువ వచ్చాయి. అయితే ఈ రోజు వచ్చిన 54 కేసుల్లో, 40 కేసులు కృష్ణా, గుంటూరు, కర్నూల్ కాకుండా, మిగతా జిల్లాల నుంచి రావటం కలవర పెట్టే అంశం.
అనంతపురం జిల్లాలో మరో 16 మందికి కరోనా నిర్ధరణ అయింది. అలాగే విశాఖపట్నంలో అనూహ్యంగా 11 కేసులు వచ్చాయి. పశ్చిమ గోదావరిలో 9 కేసులు వచ్చాయి. మొన్నటి దాకా కేసు లేదు అనుకున్న విజయనగరం జిల్లా కూడా ఓపెన్ అయ్యింది. ఇవాళ మరో కేసు నమోదు కాగా, మొత్తంగా నాలుగు కేసులు వచ్చాయి. విజయనగరం జిల్లాలో కరోనా - పాజిటివ్ కేసులు బయట పడటంతో జిల్లా యంత్రాంగం ఆవ్రమత్తమైంది. వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా, హుటాహుటీన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కేసు వెలుగులోకి వచ్చిన ప్రాంతాన్ని కంటైన్మెంటు జోన్ గా ప్రకటించి, రాకపోకలను పూర్తిగా నిషేధించారు. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
ఎక్కడైనా కరోనా వ్యాధి నిర్ధారణ అయినప్పుడు, ఆ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని కంటైన్మెంటు జోన్‌గా ప్రకటించాలన్నది ప్రభుత్వ నిబంధన. దీని ప్రకారం చిలకలపల్లి, పలగర గ్రామాల్లోని కొంత ప్రాంతాన్ని కంటైన్మెంటు జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతంతో రాక పోకలను పూర్తిగా నిషేధించారు. కంటైన్మెంటు జోన్లో ఉన్న చిలకలపల్లిలో 799 ఇళ్లు ఉండగా, సుమారు 2952 మంది నివాసం ఉంటున్నారు. చిలకలపల్లిలోనే మరో ప్రాంతంలో 1012 ఇళ్లు ఉండగా, వీటిలో 4388 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. మూడు కిలోమీటర్లు లోపలే ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా కంటైన్మెంజ్ జోన్లో చేర్చారు. సమీప గ్రామంలో పలరగలో 764 ఇళ్లలో దాదాపు 2538 మంది నివసిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలూ కలిపి సుమారు 9,878 మంది కంటైన్మెంటు జోన్లో ఉన్నారు.