అవినీతిని అంతం చేయాలని కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ1, ఏ2 ముద్దాయిలైన వైసీపీ నాయకులు పాదయాత్రల పేరుతో రోడ్లపై తిరిగేవారా అని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప నిలదీశారు. అవినీతి నిరోధక సవరణ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘అవినీతి కేసుల్లో ముద్దాయిలైన వ్యక్తులే నేరుగా ప్రధాని కార్యాలయంలో తిరుగుతూ పైరవీలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. 11 కేసుల్లో ప్రథమ నిందితుడిపై సీబీఐ రూ.45 వేల కోట్ల అవినీతి జరిగిందని కేసులు మోపితే.. ఆరేళ్లు గడిచినా ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ చూశాకే వైసీపీ, బీజేపీ కలిసిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి’ అని తెలిపారు.
ఎన్నికల సమయంలో 100 రోజుల్లో నల్లధనం తిరిగి తీసుకొస్తామని బీజేపీ చెప్పిందని.. నాలుగేళ్లు గడచినా అది జరగలేదు సరికదా.. మన తెల్లధనం విదేశాలకు తరలిపోతోందని చెప్పారు. ‘అవినీతిని ఆపాలని చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉంటే నీరవ్ మోదీ, లలిత్‌మోదీ లాంటివారు మన సొమ్ము కొల్లగొట్టకుండా ఉండేవారు. అవినీతి బిల్లు తీసుకొచ్చి నీతులు చెబుతున్న బీజేపీ ప్రభుత్వం.. కర్ణాటకలో అత్యంత అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి (గాలి జనార్దనరెడ్డి)ని ఎన్నికల్లో పక్కన పెట్టుకోలేదా..? అవినీతి ఆరోపణలతో పదవి వదిలేసిన సీఎంనే మళ్లీ సీఎం చేసేందుకు ప్రయత్నించలేదా? బలం లేకుండానే 15 రోజుల సమయమిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలుకు అవకాశం కల్పించలేదా?
ఒక్కో ఎమ్మెల్యేకు జీవితంలో సంపాదించిన దానికి రెట్టింపు సంపాదించుకునే అవకాశం ఇస్తామని బేరసారాల టేపులు బయటకు రాలేదా? ఇవన్నీ అవినీతి కాదా’ అని సభాముఖంగా ప్రశ్నించారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కర్ణాటకలో దాచిపెడితే, ఆశ్రయమిచ్చిన మంత్రి ఇంటిపై దాడి చేసి కోట్ల సొమ్మును బయటపెట్టారని.. అది సంతోషమే గాని.. చట్టాలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు విడుదల చేస్తూ మిగతా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదా అని నిలదీశారు. ఇలాగే కొనసాగితే బీజేపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని కిష్టప్ప హెచ్చరించారు.