తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరుగనుంది. రౌండ్ రౌండుకు ఫలితాలు మారుతూ రాజకీయ నాయకులకు ముచ్చమటలు పట్టించే ఫలితాలు రేపు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల సంఘం విధించిన కొత్త నిబంధనలే దీనికి కారణమని తెలుస్తోంది. గతంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో ప్రతీ రౌండు ఫలితాలు వెంటనే బయటకు ప్రకటించేవాళ్లు. అయితే కొత్త రూల్ ప్రకారం ప్రతీ రౌండు ఫలితాన్ని స్టేట్‌మెంట్ రూపంలో ముందు పోటీ చేసిన అభ్యర్థులకు ఇస్తారు. వారు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోతే దానిపై రిటర్నింగ్ అధికారి సంతకం చేసి మీడియాకు ఇస్తారు. అంతే కాకుండా ఆ రౌండ్ ఫలితాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఇలా ప్రతీ రౌండు ఫలితం స్టేట్‌మెంట్ రూపంలో పెట్టిన తర్వాతే ఫలితం ప్రకటిస్తారు. దీంతో చివరి ఫలితం గతంలో కంటే రెండు గంటల ఆలస్యం అవ్వొచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. రేపు ఎన్నికల కౌంటింగ్ జరిగే 5 రాష్ట్రాల్లో, ఈ నిబంధన అమలు చేయనున్నారు. ఇక తెలంగాణలోని 119 నియోజకవర్గాల కౌంటింగ్ 31 జిల్లా కేంద్రాల్లో జరుగనుంది. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, త్రివిధ దళాల్లో పనిచేసిన సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒక్కోలెక్కింపు కేంద్రంలో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి ఇప్పటికే రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. సమాచార మార్పిడికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.
లెక్కింపు కేంద్రాలకు అనుబంధంగా మీడియా సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. కేవలం 161 పోలింగ్ కేంద్రాలు ఉన్న భద్రాచలం నియోజకవర్గంలో తొలి ఫలితం తేలనుంది. 12 రౌండ్లు పూర్తయ్యే సరికి విజేత ఎవరనేది తేలిపోనుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 580 పోలింగ్ కేంద్రాలు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఫలితం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అక్కడ 20కి పైగా రౌండ్ల తర్వాత తుది ఫలితం రానుంది. అంతేస్థాయిలో పెద్ద నియోజకవర్గాలైన మేడ్చల్, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి స్థానాలకు 20కి పైగా రౌండ్లు పట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలూ తీసుకుంది.