విశాఖపట్నంలో ఇటీవల ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా హాజరు కావాలన్న ఆదేశాలతో హైకోర్టుకు వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలులో ఉందా అంటూ ప్రశ్నించింది. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో 1-4-4 సెక్షన్ అమలు, 500 మంది పోలీసులు లాంగ్ మా-ర్చ్ చేయడం వంటి ఘటనలను ఉదహరిస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలేమిటని ప్రశ్నించింది. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఫిబ్రవరి 27న ప్రభుత్వ అనుమతి తీసుకుని ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎయిర్ పోర్ట్ బయటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా గంటల తరబడి చంద్రబాబు కాన్వాయ్ ను కదలనీయక పోవడంతో పరిస్థితి ఉ-ద్రి-క్తం-గా మారింది.
పరిస్థితి ఎంత సేపటికీ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు సీఆర్పీసీ 151 సెక్షన్ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆందోళన చేస్తున్న వారిని కాకుండా, చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్, మహేశ్వరి సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. అలా నోటీసులు ఇచ్చిన పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఆర్పీసీ 151 సెక్షన్లోని అంశాలను మరోసారి చదవాలని డీజీపీకి సూచించారు. అయితే కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండటం వల్ల నోటీసులు ఇచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోలేదని డీజీపీ న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. విశాఖలో పరిస్థితుల ప్రభావం వల్ల అలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
కోర్టు ఆదేశిస్తే పోలీసులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ట్ చర్యలు తీసుకోవడానికి కోర్టు తీర్పు అవసరం లేదని, 'మీరు చర్యలు తీసుకోకపోతే మేమే తీసుకుంటామ'ని వ్యాఖ్యానించారు. సీఆర్పీసీ 151 సెక్షన్‌ను నిబంధనలకు విరుధంగా ఉపయోగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కేసు విచారణ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ దాదాపు ఆరు గంటల పాటు న్యాయస్థానంలో వేచి చూశారు. ఉదయం 10.25 గంటలకు కోర్టుకొచ్చిన డీజీపీ సాయంత్రం 4.15 వరకు కోర్టులోనే ఉన్నారు. అయితే కోర్ట్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మాత్రం, పోలీసులకు ఇబ్బంది అని చెప్పాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు పోలీసులు చేస్తూ పొతే, మేము జోక్యం చేసుకుంటాం, మా చేత మీరు చెప్పించుకోవాల్సి వస్తుంది అంటూ కోర్ట్ తీవ్ర వ్యఖ్యలు చేసింది.