మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై నేతలెవరూ మాట్లాడొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన రెడ్డి, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటీషన్లపై శుక్రవారం వాదనలు ముగి శాయి. కేసును ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. తదుపరి విచారణ వరకు అధికార, ప్రతిపక్ష నేతలు వివేకానంద రెడ్డి హత్యపై మీడియా ముందు, బహిరంగ సభల్లో మాట్లాడరాదని ఆదేశించింది. ఇకపై హత్యకు సంబంధించి మాట్లాడబోమంటూ పార్టీల అధినేతలు కోర్టుకు ప్రమాణ పత్రం ఇవ్వాలని పేర్కొంది.
ఈ నెల 15న మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు కడప ఎస్పీ ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయగా, సిఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్ పర్యవేక్షణలో మరో నాలుగు ప్రత్యేక ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఓ వైపు విచారణ జరుగుతున్న సమయంలోనే వివేకా హత్య రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. పరస్పర ఆరోపణల నేపధ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ వైఎస్ జగన్, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు.
పిటీషనర్ల తరుపు న్యాయవాదులు బుధవారం తమ వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వం తరుపు న్యాయవాదులు శుక్రవారం వాదనలు పూర్తి చేయడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 15కు హైకోర్టు వాయిదా వేసింది. సిట్ విచారణ యథావిధిగా కొనసాగించొచ్చని తన తీర్పులో సూచించిన హైకోర్టు సంబంధిత వివరాలను దర్యాప్తు అధికారులు బహిర్గతం చేయవద్దంటూ ఆదేశాలు వెలువరించారు. అయితే ఈ ఉత్తర్వులు, ఎవరికి ఇబ్బంది అనే చర్చ మొదలైంది. చంద్రబాబుకు ఇందులో పెద్దగా పోయేది ఏమి లేదు, ఎందుకంటే జగన్ నైజం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఒక వేళ ఈ కేసులో ఎమన్నా పెద్ద అరెస్ట్ లు జరిగితే, అప్పుడు జగన్ బ్యాచ్ , ఈ విషయం పై మాట్లాడటానికి ఉండదు. అందుకే హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు, జగన్ కే ఇబ్బంది అంటున్నారు.