గత కొన్ని రోజులుగా, కేంద్రం, రాష్ట్రానికి షాకులు ఇవ్వటం చూస్తున్నాం. అయితే, ఈ సారి మాత్రం, రాష్ట్రమే, కేంద్రానికి షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు వచ్చే డిసెంబరులోగా పనులు ప్రారంభించకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో ఇప్పటి వరకు 20 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 182. 404 ఎకరాలు, మరో 15 PSU లకు 20. 835 ఎకరాలు సీఆర్డీఏ కేటాయించింది. వాటిలో భారత నౌకాదళానికి 15 ఎకరాలు కేటాయించగా, తమకు రాజధానిలో స్థలం అవసరం లేదని నౌకాదళం ఇటీవల స్పష్టం చేసింది.
స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇంత వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ ఐడీ) మాత్రమే నిర్మాణాలు మొదలు పెట్టింది. మిగతా సంస్థలన్నీ కాల యాపన చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇంకా తమకు కేటాయించిన స్థలం వెల సీఆర్డీఏకి చెల్లించలేదు. కొన్ని సంస్థలు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పీఎస్యూల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఇటీవల సమావేశం నిర్వహించారు. స్థలాలకు డబ్బు చెల్లించాల్సినవారు అక్టోబరు నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాలని, డిసెంబరు నాటికి పనులు ప్రారంభించాలని ఆయన స్పష్టంచేశారు.
అప్పటిలోగా పనులు ప్రారంభించకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. తమకు కేటాయించిన స్థలం వరకు అనుసంధాన రహదారులు కావాలని కొన్ని సంస్థల ప్రతినిధులు కోరగా, నిర్మాణాలు మొదలు పెడతామంటే వారం రోజుల్లోనే తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ స్పష్టం చేశారు. తమ కార్యాలయ భవనాల ఆకృ తులు ఇప్పటికే సిద్ధం చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ (సీపీడబ్ల్యూడీ), కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సంస్థల ప్రతినిధులు పేర్కొన్నట్టు సీఆర్డీఏ అధికా రులు తెలిపారు. రాజధానిలో స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్ని తమ ప్రతిపాదనలకు ప్రధాన కార్యాలయం, సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో పలు బ్యాంకులు, బీమా సంస్థలు, పెట్రోలియం సంస్థలు ఉన్నాయి.