రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 10న జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ రోజు ఉదయం ఈ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సాధారణంగా మ్రంతి వర్గ సమావేశం జరగదు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రి వర్గ సమావేశాన్ని కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే నిర్వహించారు. అదే దారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫణి తుఫాను బాధితులకు సాయం, సహాయక చర్యలపై సమీక్ష, అకాల వర్షాల్లో రైతులకు వాటిల్లిన నష్టం, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరా వివిధ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
నాలుగు జిల్లాల్లో కోడ్ సడలించిన నేపథ్యంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహణకు ఆటంకాలేవీ ఉండే అవకాశం లేదని కొందరు మంత్రులు భావిస్తున్నారు. ఈ సమావేశం నిర్వహణ అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆమోదించి మ్రంతి వర్గ సమావేశానికి పంపాల్సి ఉంటుంది. అయితే, ఆయన ఎలా స్పందిస్తారో తెలియరాలేదు. ఆయన వస్తారా లేక, ఆ రోజు సెలవు పెట్టి, ఇంచార్జ్ చీఫ్ సెక్రటరీగా ఎవర్ని అయినా పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంత జరిగిన తరువాత, ఆయన చంద్రబాబు ముందుకు రాలేరని, మరి ఆయన రాకపోతే బిజినెస్ రూల్స్ ప్రకారం క్యాబినెట్ ఎమన్నా చర్యలు తీసుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది.
కాగా, సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశానికి సంబంధించి విపక్ష పార్టీల రివ్యూ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో వాదనలు ఎలా వినిపించాలనే విషయంపై ఇతర పార్టీల నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. మంగళవారం రాత్రి అక్కడ నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. బుధ, గురువారాల్లో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. గురువారం రాత్రికి అమరావతి చేరుకుంటారు. ఈ పర్యటన కారణంగా ఈ నెల 7న నిర్వహించాల్సిన చిత్తూరు, తిరుపతి లోక్సభ స్థానాల సమీక్ష వాయిదా పడింది.