రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గత మూడు రోజులుగా ఢిల్లిలోనే ఉన్నారు. శుక్రవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారితో భేటీ అనంతరం ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో ‘రాష్ట్రంలో మైనింగ్ విభాగం’ కేసు విచారణకు హాజరయ్యారు. ఒక విధంగా సీఎస్ ఎల్వీ అధికారిక పర్యటన నిన్ననే పూర్తయినప్పటికీ ఆయన ఈ రోజు కూడా ఢిల్లిలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల తాను సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. అందరికీ లీగల్ నోటీసులు పంపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం.
శనివారం ఢిల్లిలో పలువురు సీనియర్ న్యాయవాదులు, లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని ఆయన ఆంతరంగికులు చెబుతున్నారు. ఒకవేళ సీఎస్ ఎల్వీ న్యాయవాదులతో సమావేశమై తే మే 23న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందుగానే వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తారా? లేదా ఫలితాలు వెల్లడైన తరువాత న్యాయపరమైన చర్యలు ప్రారంభిస్తారా? అనే విషయంలో తర్జనభర్జన పడుతు న్నట్లు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం తనను సీఎస్‌గా నియమిస్తే తనపై లేనిపోని ఆరోపణలు చేయడంతో పాటు తాను ఎలాంటి నేరం చేయలేదని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు తీర్పు చెప్పినా.. తనను దోషిగా, ముద్దాయిగా పేర్కొనడం.. మీడియాలో పదేపదే అదే పదాన్ని వినిపిస్తుం డటంతో సీఎస్ ఎల్వీ తీవ్ర మనస్తాపం చెందినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
ఇది ఇలా ఉంటే, రాష్ట్రంలో వింత పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పాలన ఎవరిది? సీఎం చంద్రబాబు పని చేయకూడదని సీఈవో తేల్చేశారు. మరి ఏపీలో మంచినీటి కొరత ఏర్పడింది. తుపాను ముంచుకొస్తోంది. ఏపీలో ప్రజా ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడాల్సిందేనా? సీఈసీకి చంద్రబాబు లేఖ రాసినా ఎందుకు స్పందించటం లేదు? ఏపీలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణం ఉంది. అది రాజకీయంగా మాత్రమే కాదు నిజానికి వాతావరణ పరంగా కూడా భిన్నంగానే ఉంది. ఓవైపు ఎండలు మండిపపోతుంటే.. మరోవైపు తుపాను ముంచుకొస్తోంది. ఎండల కారణంగా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నెలకొంది. ప్రభుత్వం వైపు నుంచి సరైన చర్యలు లేవు. దిశా నిర్దేశం చేసే అధికారులూ లేరు. చీఫ్ సెక్రటరీ అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కానీ అసలైన ప్రజా సమస్యల విషయంలో మాత్రం సమయం కేటాయించడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.