ఈసీ నియామకంతో సీఎస్ పోస్టులోకి వచ్చిని ఎల్వీ సుబ్రమణ్యం తీరు మరోసారి విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంతో ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తున్న ఎల్వీ తాజాగా, ఢిల్లీ ఆదేశాల మేరకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనపై పోస్టు మార్టం ప్రారంభించారు. ఈ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో ఏం జరిగింది..ఏయే టెండర్లు ఎవరికిచ్చారు? ఎందుకిచ్చారు? చెల్లింపుల వివరాలు ఎంటీ అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే భూకేటాయింపులపైనా దృష్టి సారించారు. ఏయే సంస్థలు, కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయి? ఎవరెవరికి ఏయే ప్రతిపాదికన భూములను కేటాయించారు.? అనే అంశాలపై పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకుంటున్నారు సీఎస్ ఎల్వీ. సీఎంతో సంబంధం లేకుండానే కొన్నాళ్లుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎస్ ఎల్వీ. దీనిపై విమర్శలు వస్తున్నా..ఆయన మాత్రం అదే ఒరవడి ప్రదర్శిస్తున్నారు.
రేపు మరోసారి అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే..కొన్ని శాఖలకు మాత్రం గత ఐదేళ్ల వివరాలతో నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. ప్రాజెక్టులు, పథకాలు, పిలిచిన టెండర్లు, కాంట్రాక్టు వ్యవహారాలు..ఇలా అన్ని వివరాలతో సమావేశానికి రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదారు కీలక విభాగాల నుంచి ఐదేళ్ల చరిత్రకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. మరో 9 కీలక శాఖల రిపోర్టులు కూడా అధికారులు సిద్దం చేస్తున్నారు. ఈ నివేదకలపై రేపటి కీలక సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో వివిధ ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణపై ఫోకస్ చేసిన ఎల్వీ..ఓ నివేదికను తెప్పించుకున్నట్లు తెలస్తోంది.
కొత్త సీఎస్ లు వివిధ శాఖలపై పట్టు సాధించేందుకు శాఖల వారీగా నివేదికలు తెప్పించుకోవటం సాధారణమే. అయితే..ఆయా శాఖల ముఖ్య కార్యదర్శుల నుంచి తమకు కావాల్సిన సమాచారం తెప్పించుకుంటారు. కానీ, ఎల్వీ మాత్రం ప్రిన్సిపల్ సెక్రటరీలను పక్కనపెట్టి ఆయా శాఖల డైరెక్టర్లు, కమిషనర్లు, ఇంజనీరింగ్ చీఫ్ ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. శాఖల వారీగా గత ఐదేళ్ల నివేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సాంప్రదాయానికి భిన్నంగా ప్రిన్సిపల్ సెక్రటరీలను కాదని వివరాలు సేకరిస్తుండటం అధికార వార్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్ మార్టం వెనక అంతర్యామేంటి అంటూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు టార్గెట్ గా సీఎస్ పావులు కదుపుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.