రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ఊరట లభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కరెంటు చార్జీలను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్వల్పంగా తగ్గించింది. దీంతో దాదాపు 40లక్షల మంది వినియోగదారులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ టారి్‌ఫలను సమీపపు 5/10పైసలకు సరిచేసి కుదించినట్లు ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో 2019-20 విద్యుత్ టారిఫ్ ఉత్తర్వును సభ్యులు పి.రామ్మోహన్, పి.రఘుతో కలసి ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా జస్టిస్ భవానీప్రసాద్ మాట్లాడుతూ, ఆదాయపు పన్ను పరిధిలోకి రాని రైతులకు 9గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.
లోడ్ ఫ్యాక్టర్ ఇన్సెంటీవ్ స్కీమ్ కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నామని, దీనిద్వారా యూనిట్‌కు 50పైసల మేర ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రైవేటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని పొందుతున్న రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ సరఫరా పరిమితిని ఏడాదికి 1,200నుంచి 1,500యూనిట్లకు పెంచామన్నారు. విద్యుత్ టారి్‌ఫలోని కొన్ని ప్రధానాంశాలు: వ్యవసాయానికి ఉచితంగా 9గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించడం వల్ల ప్రభుత్వంపై రూ.7,064.27కోట్ల సబ్సిడీ భారం పడింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే లబ్ధి పొందుతున్న 17లక్షల మందికి మరో 3లక్షల మంది కలసి మొత్తం 20లక్షల మంది ఉచిత విద్యుత్ పరిధిలోకి వస్తారు. గ్రామీణ ఉద్యాన నర్సరీలకు, దోభీఘాట్‌లకు ప్రభుత్వ సబ్సిడీతో పాటు నెలకు 150యూనిట్లు, స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. రైల్వే ట్రాక్షన్ టారి్‌ఫను యూనిట్ ధర 3.50నుంచి3.75కు పెంచారు. అప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చార్జీలే చాలా తక్కువ. ఉప్పు తయారీ యూనిట్ ధర 1.20కి పరిమితం చేయడం వల్ల రూ.3.70దాకా తగ్గుదల ఉంటుంది.
పరిశ్రమలకు పీక్ టైం, టైమ్ ఆఫ్‌డే చార్జీలు యూనిట్‌కు రూ.1.05నుంచి రూపాయికి తగ్గాయి. పుట్ట గొడుగుల పరిశ్రమకు యూనిట్‌కు రూ.5.91నుంచి రూ.2..16కు కుదించారు. కోళ్ల పెంపకందార్లకు యూనిట్ ధర 1.04కు కుదించడంతో 3.85నుంచి 4.85దాకా తగ్గింది. హెచ్‌టీ పరిశ్రమలకు లోడ్ ఆధారంగా 50పైసలు తగ్గించారు. ఆఫ్‌పీక్ సమయంలో యూనిట్‌కు రూపాయి చొప్పున రాయితీ లభిస్తుంది. విద్యుత్ వాహనాల వాడకం పెంచేందుకు యూనిట్ ధర 6.95 నుంచి 5కు తగ్గించారు. ఆక్వా కల్చర్, పశుసంవర్థక, కోళ్ల పెంపకం, కోళ్ల మిక్సింగ్ యూనిట్లను వ్యవసాయ ఆధారిత కేటగిరీలోకి తెచ్చారు. పట్టు పరిశ్రమకు 10నుంచి 15హెచ్‌పీ వరకూ బిల్లులు చేయడంతో సబ్సిడీకి అర్హులయ్యారు. రైతులకు అత్యవసర సరఫరా కోసం యూనిట్‌కు చెల్లించే ధర 10.50నుంచి 3.75కు తగ్గించారు. అనాథాశ్రమాలు, ధార్మిక సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తారు. చక్కెర పరిశ్రమకూ రాయితీ వర్తిస్తుంది. పరిహారం చెల్లింపునకు డిస్కమ్‌లు రూ.10కోట్ల వరకూ వినియోగించుకునే అవకాశం కల్పించారు.