ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు ఇది తీపికబురే. విద్యుత్ చార్జీలు పెంచకుండా వచ్చే ఏడాది కూడా ప్రస్తుత విద్యుత్ చార్జీల టారిఫ్‌నే ప్రభుత్వం యథాతథంగా కొనసాగించనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏవిధమైన విద్యుత్ చార్జీల పెంపుదల లేకుండా ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రూపొందించాయి. 2019-20కిగాను రాష్ట్రంలో వినియోగదారులకు నాణ్య మైన, నమ్మకమైన విద్యుత్ పంపిణీకోసం రూ.38,204 కోట్లు అవసరం అని పేర్కొంటూ రూపొందించిన నివేదికను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి అందచేశాయి. శనివారం సింగరేణి భవన్‌లోని ఏపీ ఈఆర్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఈపీడీసిీఎల్ సీఎండి హెచ్‌వై దొర, సీజీఎం ప్రసాద్ , ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం బి.లలిత తదితరులు 2019-20 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)ను ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ జి.భవానీప్రసాద్‌కు సమర్పించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా విద్యుత్ చార్జీల టారిఫ్‌ను ఇప్పుడున్నట్టుగానే యథాతథంగా కొనసాగించనున్నట్టు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో సగటున 7.8శాతం వృద్ధి ఉన్నప్పటికీ ఆదాయంలో మాత్రం సగటు యూనిట్ విద్యుత్ ధర రూ.1.49గా ఉండటంతో రాష్ట్రంలో 1.64కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు లాభపడనున్నట్టు ఏఆర్‌ఆర్ నివేదిక ద్వారా వివరించారు. ఇందులో ఎల్టి డొమెస్టిక్ కింద 1.31కోట్ల మంది వినియోగదారులు లబ్ది పొందుతారని , అదే విధంగా 17లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు కూడా లబ్ది పొందుతారని పేర్కొన్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి లక్ష విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు.
కమర్షియల్ కేటగిరిలో 12.1లక్షమంది వినియోగదారులు లబ్ది పొందుతారని వెల్లడించారు.కాటేజెస్ ఇండస్ట్రీస్ పరిధిలోని దోబీఘాట్స్‌కు ఉచిత విద్యుత్ సరఫరాను కొనసాగించనున్నట్టు తెలిపారు.రాష్ట్రంలోని నాలుగువేల మంది ఉద్యాన నర్సరీ పెంపకందారులకు కూడా ఉచితంగానే విద్యుత్ సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. విద్యత్ వాహనాలకు చార్జింగ్ కోసం ఈవీపాలసీ ప్రోత్సాహం కింద టారీఫ్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.6.95నుంచి రూ.5.95కు తగ్గించి యూనిట్‌కు రూపాయి సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించనున్నట్టు నివేదికలో పొందు పరిచి ఈ మేరకు డిస్కమ్ అధికారులు ఏపీ ఈఆర్సీసి ఛైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్‌కు ఏఆర్‌ఆర్ నివేదికను సమర్పించారు.