తిత్లీ తుఫాను దెబ్బకు విలవిలలాడిన శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి జిల్లాలో పర్యటించనున్నారు. తుఫాను తీరం దాటిన తర్వాత నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్న చంద్రబాబు,ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ,సహాయక చర్యలను పరుగులు పెట్టించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో, మౌలిక వసతుల పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయి. అయితే అధికారిక కార్యక్రమాల కోసం రెండు రోజుల పాటు అమరావతికి విచ్చేసిన చంద్రబాబు, మరోసారి శ్రీకాకుళం జిల్లా వెళ్లారు.
ఇదే అంశంపై నిన్న అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు, తుఫానులను ఎదుర్కొనే విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏడాదిలో ఓ రోజును ‘సైక్లోన్ డే’గా నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో సంభవించిన హుద్‌హుద్, ప్రస్తుత తిత్లీ తుపాను అనుభవాల ఆధారంగా తుపానులను ఎదుర్కోవడంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను ముందుగానే సన్నద్ధం చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తుపానులన్నీ అక్టోబరు నెలలోనే వస్తున్నా వాటిని ఎదుర్కొనేందుకు సరైన విధానం లేదని ఇకపై ఇలా జరగకూడదని, కచ్చితమైన విధానాన్ని అనుసరించాల్సిందేనన్నారు.
తుపానులు, భారీ వర్షాలు వచ్చేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై కోస్తాంధ్రలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.. చంద్రబాబు. తుఫాను సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా బలమైన గాలులను సైతం తట్టుకుని నిలబడగలిగేలా విద్యుత్ స్తంభాల్ని వినియోగించాలన్నారు. అలాగే ప్రతీ పది, పదిహేను గ్రామ పంచాయతీలకు ఓ జనరేటర్ ను ఉంచాలని సమీక్షలో నిర్ణయించారు. ప్రధానంగా అక్టోబరు, నవంబరులోనే తుపాన్లు వస్తున్నా వీటిని ఎదుర్కోవటంలో మాత్రం పక్కా విధానం లేదు. హుద్‌హుద్ సమయంలో తయారుచేసిన బ్లూబుక్‌లో వీటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రస్తావనలున్నా, వరదల సమయంలో మాదిరి దీనిని అనుసరించటం లేదు. ఇకపై పక్కా విధానం అనుసరించాలని తాజా సమీక్షలో సీఎం నిర్ణయించారు.