పర్చూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సీనియర్ రాజకీయ నాయకులు డా. దగ్గుబాటి వెం కటేశ్వరరావు ఆత్మీయులతో సమావేశం కాబోతున్నారంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఆయన నివాసంలో చేపట్టిన మరమ్మతులపై రాజకీయ అంచనాలు ప్రారంభమయ్యాయి. జగన్ పార్టీలో చేరే విషయం పై నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ, ప్రచారం జరుగుతుంది. మాజీమంత్రి, వైసీపీ ఒంగోలు లోక్సభ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో ఆయనను కలిసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఇంకొల్లులోని తన కుటుంబానికి చెందిన కళాశాలలో సోమవారం సమావేశం ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి సమావేశం జరగలేదు. అయితే సోమవారం సాయంత్రానికి సమావేశం బుధవారానికి వాయిదా పడినట్లు ప్రచారం ప్రారంభమైంది. ఇంకొక వైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చెందిన కారంచేడులోని నివాసగృహంలో స్వల్ఫ మరమ్మతులకు శ్రీకారం పలికారు. తనకిష్టమైన రీతిలో ఇంటి ఆవరణలో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన కుటీరాన్ని నిర్మించుకున్నారు. దానికి ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ఆయన లేక ఆయన కుమారుడు ఎన్నికల సమయంలో రావటానికే ఇవన్నీ చేస్తున్నారంటూ ఊహాగానాలకు తెరలేపారు.
ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు సోమవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటు దగ్గుబాటి వ్యవహారంపై పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఏలూరి సమావేశం నిర్వహించటం నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశమైంది. దగ్గుబాటి ఆత్మీయులతో సమావేశం జరగకపోయినా సోమవారం ఆయన స్వగ్రామమైన కారంచేడు రావటం, ఏలూరి సమావేశానికి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యులు హడావుడికి వెళ్లటం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.