చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పర్చూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌లు బుధవారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన వైసీపీ కార్యాలయంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గం నుంచి అలాగే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల నుంచి ఆమంచి అభిమానులు తాడేపల్లికి తరలివెళ్లారు. ఇలా ఉండగా సీనియర్ నాయకులు, మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను వేసుకోలేదు. ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్‌కి మాత్రమే జగన్ కండువా వేశారు. ఇటు దగ్గుబాటి, అటు ఆమంచి, హితేష్ పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఒకేసారి నిర్వహించారు.
తొలుత ఆమంచికి జగన్ కండువ వేయబోగా ఆయన వెంకటేశ్వరరావుని ముందుకు ఆహ్వానించారు. అయితే వెంకటేశ్వరరావు ముందుకు రాకుండా ఆయన కుమారుడిని పంపారు. వెంటనే జగన్ హితేష్ మెడలో వైసీపీ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఆ వెంటనే ఆమంచికి కూడా పార్టీ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటించారు. ఇంతకు హితేష్ ఒక్కరే పార్టీలో చేరటం, డా. దగ్గుబాటి వైసిపి కండువా వేసుకోకపోవటం, ఇప్పటికే డా. దగ్గుబాటి సతీమణి, హితేష్ తల్లి పురంధేశ్వరి బీజేపీలో కీలకపాత్ర పోషిస్తుండటంతో టీవీలలో ఈ దృశ్యాలు చూసిన వారిలో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. పార్టీలో చేరుతున్నా అని చెప్తూనే, జగన్ చేత ఎందుకు కండువా వేయించుకోలేదో ఎవరికీ అర్ధం కాలేదు.
టీడీపీలో ఉన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్,, చీరాల నుంచి భారీగా ర్యాలీగా వెళ్లేందుకు ఆమంచి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసు 30వ చట్టం అమలుకు శ్రీకారం పలకటంతో అక్కడి నుంచి ర్యాలీగా కాకుండా నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల నుండి ఆయన అనుచరులు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా కాపుసంఘం జిల్లా నాయకుడిగా ఉన్న ఆయన సోదరుడు ఆమంచి స్వాములు సూచనలు, ఆమంచితో సన్నిహిత సంబంధాలున్న కాపు సామాజికవర్గం, ఇతర మరికొందరు వాహనాలలో వెళ్లారు. మంగళగిరి దగ్గర జాతీయ రహదారిపై వీరి వాహనాలన్నింటినీ ఆపి అక్కడి నుండి ర్యాలీగా వెళ్లారు. మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పార్టీలో చేరాలని అనుకున్నప్పటికీ గంట ఆలస్యంగా ఆమంచి పార్టీలో చేరారు.