పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేసిన వారు విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో అనేక పర్యాయాలు ఇలా జరిగింది. తొలుత మద్దుకూరి నారాయణ, తర్వాత గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారు వరుసగా రెండుసార్లు విజయం సాధించటంతో ఈసెంటిమెంట్‌కు బలం చేకూరింది. 1972లో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దుకూరి నారాయణ 1978లో పార్టీ మారి పోటీచేసినా విజయం దక్కించుకున్నారు. 1984లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రెండోసారి 1989లో పోటీచేసి విజేతగానే నిలిచారు.
1991 ఉప ఎన్నికల్లో గెలిచిన గాదె వెంకటరెడ్డి ఆతర్వాత 1994 ఎన్నికల్లో కూడా గెలిచి సెంటిమెంట్‌ను నిజం చేశారు. 2004లో పర్చూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించి నమ్మకాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఏలూరి సాంబశివరావుకు ప్రస్తుతం ఎన్నికల్లోనూ టీడీపీ టికెట్టు లభించింది. ఈసారి ఆనవాయితీ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ ప్రజల్లో కొనసాగుతోంది. ఇదే సెంటిమెంట్ రిపీట్ ఐతే టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారనీ, దగ్గుబాటికి కష్టమేనని పర్చూరు వాసులు చెప్పుకుంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో..? గెలుపు ఎవరిని వరిస్తుందో.. తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే..