ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ప్రత్యెక స్థానం ఉందనే చెప్పాలి. అయితే ఆయన 2014 ఎన్నికల నాటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన భార్య పురంధేశ్వరి మాత్రం, బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇద ఇలా ఉంటే గత కొంతకాలం నుంచి దగ్గుబాటి కుటుంబ వారుసుడిగా హితేష్ చెంచురామ్‌ని పోటీలో దించే విషయం పై వెంకటేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీ అగ్రనాయకులలో కొందరు ఆయనను కలిసి పార్టీలో చేరమని పర్చూరు నుంచి ఆయన కుమారుడిని పోటీలో దించమని కోరారు. దగ్గుబాటి అంగీకరిస్తే ఆయన సతీమణి పురంధేశ్వరికి లోక్‌సభకు పోటీచేసే అవకాశం కూడా ఇస్తామని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనపై ప్రారంభంలో సానుకూలత చూపని దగ్గుబాటి ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులపై అలోచించి నిర్ణయం తీసుకున్నారని పరిణామాలు చూస్తే అర్ధమవుతుంది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తన కొడుకుతో పాటు, వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్ ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా సమాయత్త్తమవుత్నుట్లు సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొంతకాలంగా దగ్గుబాటి, వైసీపీ అధినేత జగన్ మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పార్టీలో దగ్గుబాటి చేరిక ఖాయమైందని వైసీపీలోని ఉన్నత స్థాయి నాయకులు చెబుతున్న సమయంలోనే పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఆయన అభిమానులు వైసీపీ ఫ్లెక్సీలపై దగ్గుబాటి, ఆయన కుమారుడి ఫొటోలు ఉంచి సోషల్ మీడియాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే, ప్రస్తుతం బీజేపీలో ఉన్న దగ్గుబాటి భార్య పురందేశ్వరి అందులోనే ఉంటారని తెలుస్తోంది.
మరో పక్క, పర్చూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నను వేస్తున్నారు. గొట్టిపాటి భరత్, దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌లలో ఎవరు ధీటైన అభ్యర్థి అని ఆ ఫోన్ వాయిస్‌లో అడగటం విశేషం. అలా నియోజకవర్గంలోని పలువురు వైసీపీ శ్రేణులకు ఫోన్‌కాల్స్ వచ్చాయి. అయితే అందులో ప్రస్తుత పార్టీ సమన్వయకర్త రంగనాథబాబు పేరు లేకపోవటం విశేషం. వైసీపీలో ఇలాంటి సంప్రదాయం లేదని కూడా అంటున్నారు. దీంతో ఆ సర్వేపై పలురకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దగ్గుబాటి వైపు నుంచే ఈ సర్వే జరుగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. కుమారుడిని వైసీపీలోకి పంపించాలాని, దాదపుగా నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.