ప్రాభవాన్ని కోల్పోతున్న డప్పు కళకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. యవతకు డప్పు వాయిద్యంలో శిక్షణ ఇవ్వడానికి తోడుగా, డప్పు కళాకారులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. డప్పు కళాకారులకు నెలకు రూ.1,500 పింఛన్ మంజూరు చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. పింఛన్ పొందేందుకు వయో పరిమితి 50ఏళ్లుగా నిర్ణయించారు. లబ్దిదారులు బీపీఎల్ కేటగిరికి చెందినవారై ఉండాలనీ, గతంలో మరో పింఛన్ పొంది ఉండరాదనీ, సంక్షేమ శాఖ నిర్దేశించిన ఇతర అర్హతలను కలిగి ఉండాలని ఆ జీఓ పేర్కొన్నది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానిక, సులభ, సాంప్రదాయిక వాయిద్యం ‘డప్పు’..అనేక కుటుంబాలకు వారసత్వంగా వస్తున్న గ్రామీణ కళారూపం. జానపద సంగీత, నత్య విభావరుల్లో కీలక వాయిద్యం డప్పు. శుభానికి, అశుభానికి, ఆనందంలో, ఆవేదనలో గ్రామాల్లో, పట్టణాల్లో డప్పు ఢమఢమలు ప్రతిధ్వనించడం అనాదిగా సాంప్రదాయంగా వస్తోంది. మన రాష్రంలో మానవ జీవన దశలన్నింటిలో డప్పు దరువు మోగాల్సిందే. పండుగ, పబ్బాలు, గ్రామోత్సవాలు, తిరునాళ్ల సందడుల్లోనే కాదు పుట్టుకలో, పెళ్లిళ్లు, చావులు అన్ని కార్యక్రమాల్లోనూ దాదాపు ఏపీలోని పల్లెల్లో, వార్డులలో డప్పు మార్మోగుతుంది.
అయితే, ఇప్పటి యువతరం డప్పు కళను జీవనోపాధిగా చేసుకోవడానికి సుముఖంగా లేదు. దానినే ప్రధాన ఉపాధిగా మలుచుకోలేని పరిస్థితిలో వేరే వృత్తులకు మళ్లుతున్నారు.దీనితో డప్పుకళ మనుగడ కోల్పోయే దుస్థితి ఏర్పడింది. పల్లెల్లో, పట్టణాలలో డప్పు కళాకారుల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయిక డప్పు కళకు జవం, జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే పింఛన్ మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది.