డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించిన ఆయన డేటా దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కై తెదేపాను దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. డేటా అనేది పార్టీ వ్యక్తిగత విషయమని, అందులో తలదూర్చితే మూలాలు కదులుతాయని హెచ్చరించారు. ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. వైకాపాకు చెందిన కొందరు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై దాడి చేస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
మన ప్రభుత్వ డేటాను ఎవరో దొంగిలిస్తే హైదరాబాద్‌లో ఉన్న పోలీసులు కాపాడతారట అంటూ ఎద్దేవాచేశారు. ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేశారని డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా అని సీఎం ప్రశ్నించారు. మదనపల్లె గ్రామీణ మండలం చిప్పిలిలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ వద్ద హంద్రీ-నీవా కాలువ ద్వారా చేరుకున్న కృష్ణాజలాలకు ముఖ్యమంత్రి సోమవారం జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంతకుముందు చిప్పిలి సమీపంలో విజయ పాల డెయిరీ, సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.24కోట్ల వ్యయంతో నిర్మించిన టెట్రా ప్యాక్ యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేశారు.
నా ఓటూ తొలగిస్తారేమో.. ‘‘బిహార్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వైకాపాకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 8 లక్షల ఓట్లను తొలగించారు. అందుకోసం ఫామ్-7 వినియోగించారు. చూస్తుంటే నా ఓటును కూడా తొలగిస్తారేమో. ఓట్ల తొలగింపుపై పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మోదీ, కేసీఆర్, జగన్.. ముగ్గురూ కలిసి రాష్ట్రంపై ఎన్ని కుట్రలు చేసినా ఉపేక్షించేది లేదు’’ అని చంద్రబాబు అన్నారు. ‘‘దొంగాటలు వద్దు.. ధైర్యంగా రండి.. మీరేంటో... మేమేంటో తేల్చుకుందాం. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. కోడికత్తిని పెద్ద ఇష్యూ చేశారు. ఐటీ దాడులకు మేం భయపడం. 8 లక్షల ఓట్లను తొలగించడానికి కుట్ర చేశారు. బతికి ఉన్న వాళ్ల ఓట్లను కూడా తొలగిస్తున్నారు. ఓట్లను తొలగించడానికి ప్రశాంత్ కిషోర్ ఎవరు? నీ ఆటలు ఇక్కడ సాగవు. ఇది బీహార్ కాదు. సైబర్ క్రైమ్ చేసే వాళ్లను వదిలిపెట్టం. కోర్టుకీడుస్తాం. ఓటు తీసేసినంత సలువుగా ఆస్తులు కూడా కొట్టేస్తారు’’ అని చంద్రబాబు చెప్పారు.