గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారికంగా, సుప్రీం కోర్టు జస్టిస్ తో పాటుగా, ఆరుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలను టార్గెట్ చేస్తూ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు, జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను, అధికారికంగా మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే లేఖ రాయటం పైన ఎవరికీ అభ్యంతరం లేదు కానీ, కాబోయే చీఫ్ జస్టిస్ ను, అదీ ప్రజా ప్రతినిధుల పై కేసులు ఏడాదిలోగా తేల్చేయాలని ఆ జస్టిస్ బెంచ్ విచారణ చేస్తున్న సమయంలో, ఇలా టార్గెట్ చేయటం పై, అన్ని వైపుల నుంచి జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు వస్తున్నాయి. అన్ని సంఘాలు, పెద్ద పెద్ద న్యాయవాదులు, జగన్ వైఖరిని తప్పు బట్టారు. ఈ క్రమంలోనే, మొదటిగా స్పందించింది, ఢిల్లీ హై కోర్టు బార్ అసోసియేషన్. జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు రాసిన లేఖ, అందులోని అంశాలను తప్పు బడుతూ ఢిల్లీ హై కోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసి, ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తీర్మానం పై సంతకం చేసింది ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభిజిత్. అయితే ఎప్పుడైతే తాను జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేసి మీడియాకు వదిలనో, అప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటూ, అభిజిత్, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా బార్ అసోసియేషన్ సెక్రటరీకి బెదిరింపులు రావటం పై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు అభిజిత్ ఈ రోజు లేఖ రాసారు. తాము జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ పై రాసిన లేఖ పై ఖండిస్తూ ఒక తీర్మానం చేసామని, ఆ తీర్మానం పై తన సంతకం ఉందని, ఈ తీర్మానం అక్టోబర్ 14న మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచురితం అయిన విషయం చెప్తూ, తరువాత రోజు, అంటే అక్టోబర్ 15న తాను, తన ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉండగా, ఉదయం 11 గంటల సమయంలో తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, అవతల వ్యక్తి తాను, ఇండియన్ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ కు సెక్రటరీ అని చెప్పారని, తరువాత తనను హిందీలో దుషిస్తూ, బెదిరించారని, ఎందుకు ఆ తీర్మానం చేసారు అంటూ తన పై దుర్భాషలాడారని తన ఫిర్యాదులో తెలిపారు. అయితే తాను ఎటువంటి రిప్లై ఇవ్వకుండా ఫోన్ పెట్టేసానని, తరువాత మళ్ళీ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఇదే రకమైన బెదిరింపు ఫోన్ కాల్స్, తమ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహిత్ కి కూడా వచ్చాయని తెలిసిందని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ పరిణామంతో తమ కుటుంబం భయపడిపోయిందని, తమ హక్కులను కాపాడాలని పోలీస్ కమిషనర్ కు రాసిన ఫిర్యాదు లేఖలో, అభిజిత్ తెలిపారు. అయితే ఈ ఫోన్ కాల్స్ ఎవరు చేసారు, ఎవరు చేయమంటే చేసారు ? అనే విషయం పై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.