భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంకూడా, ఏపీ ప్రభుత్వంలా ఇంతఘోరంగా ఎన్నికల నిర్వహణ చేయలేదని, 10నెలల క్రితం భారీమెజారిటీతో గెలిచిన జగన్ ప్రభుత్వం, నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కుతూ, దొడ్డిదారిలో వెళుతోందని టీడీపీనేత, ఆపార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓడిపోతామన్న భయం వైసీపీ ప్రభుత్వానికి పట్టుకోవడంతో, వ్యవస్థలను ప్రలోభపెడుతూ, అధికారులను బెదిరిస్తూ గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తోందన్నారు. పక్క రాష్ట్రాలనుంచి మద్యం తీసుకురావడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ తరుపున నామినేషన్లు వేసేవారిని అడ్డుకోవడం, మంత్రి అనుచరులే ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడి, అభ్యర్థులపై దాడిచేయడం వంటి అనేక ఘటనలు చూశామన్నారు. తన నియోజకవర్గంలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీపై దుష్ర్పచారం చేస్తూ, తన తప్పులను ప్రతిపక్షంపైకి నెట్టడానికి ప్రయత్నించాడన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వాలంటీర్లతో సమావేశం నిర్వహించి, మీరంతా జగనన్న రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం కాదా అని దీపక్ రెడ్డి ప్రశ్నించారు.
ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నా ఎన్నికల కమిషన్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన దానికి కొనసాగింపుగా చిత్తూరుజిల్లాలో మరికొన్ని ఘటను జరిగాయని, అదేవిధంగా మచిలీపట్నం, జగ్గయ్యపేట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కూడా టీడీపీతరుపున పోటీచేసేవారికి ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా, ఇంటి, ఆస్తి, కొళాయి పన్నులు చెల్లింపులు చేసుకోకుండా, నామినేషన్లు వేయనీయకుండా కావాలనే అడ్డుకోవడం జరిగిందన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ధృవీకరణ పత్రాలు కోసం వెళ్లిన ప్రతిపక్షపార్టీ సభ్యులకు, అధికారులు అనేక కుంటిసాకులు చెప్పారని, తాము ఇవ్వడం కుదరదని, ఇచ్చే అధికారం తమకు లేదని, తాము విధుల్లో లేమని, తమస్థానంలో కొత్తవారు వచ్చారని, సర్టిఫికెట్లు ఆఫ్ లైన్ లో ఇవ్వకూడదు.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి అంటూ తమపని తాము చేయకుండా తప్పించుకోవడం ఎంతవరకు సబబని దీపక్ రెడ్డి నిలదీశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే అధికారులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని, వారిని అడ్డంపెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని జగన్ సర్కారు చూస్తోందన్నారు. నిజంగా ప్రభుత్వానికి ప్రజాబలం, వారి ఆమోదం ఉంటే, ఇన్నితప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా, రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే, ఎన్నికల సంఘం ఏం చేస్తోందని దీపక్ రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసి, తద్వారా వచ్చే ఫిర్యాదులు.. విజ్ఞప్తులపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ కు ఇప్పటికే 8-9సార్లు ఫిర్యాదుచేశామని, వాటిపై ఇప్పటివరకు స్పందించలేదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తున్న అధికారపార్టీ నేతలు, మంత్రులపై చట్టపరంగా క్రిమినల్ కేసులు మోపి చర్యలు తీసుకోవాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల దృష్ట్యా వేగంగా కుల, ఆదాయ, ఇతరేతర సర్టిఫికెట్లు అభ్యర్థులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం రిజర్వేషన్ల అమలునుకూడా అడ్డగోలుగా అమలు చేస్తోందని, బీసీల స్థానాలు వారికి దక్కకుండా చేయడం, గ్రామాలను తీసుకెళ్లి పట్టణాల్లో కలపడం వంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ చర్యలను గమనించాలని, వారి దృష్టికి వచ్చే సమస్యలను టీడీపీ హాట్ లైన్ కు పంపాలన్నారు. (విలేకరుల సమావేశంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కొత్తకోట, తంబళ్లపల్లి మండలాల అధికారులు, వీఆర్వోలు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో మాట్లాడుతూ, మీరు కోరే సర్టిఫికెట్లు మేము ఇవ్వలేమంటూ చెప్పిన ఆడియోను దీపక్ రెడ్డి విలేకరులకు వినిపించారు.)