అయిదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, ప్రజాసంఘాల నాయకులు ధర్మపోరాట దీక్ష చేస్తే ఆ ఖర్చుపై అనవసర రాజకీయం చేస్తారా.. అంటూ రాష్ట్ర మంత్రిమండలి ఆగ్రహం ప్రకటించింది. అందుకోసం రూ.10కోట్లు వెచ్చించారంటూ దుష్ప్రచారం చేయడంపై మంత్రివర్గ సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వెలగపూడి సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశంలో దిల్లీ ధర్మపోరాట దీక్ష, మోదీ చేసిన విమర్శలపై చర్చ జరిగింది. దీక్ష నిమిత్తం రూ.2.83 కోట్ల ఖర్చుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.1.23కోట్లు రైళ్లకు, రూ.1.60 కోట్లు ఏపీ భవన్ వద్ద ఖర్చులకు వినియోగించినట్లు పేర్కొన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011 సెప్టెంబర్ 17న నరేంద్రమోదీ సద్భావన మిషన్ పేరుతో చేసిన ఖర్చు ధర్మపోరాట దీక్ష వ్యయం కంటే చాలా ఎక్కువన్న అంశమూ చర్చకు వచ్చింది. మోదీ దీక్ష స్వార్థానికి, ఆయన పార్టీ ప్రయోజనాల కోసం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక రంగం కుదేలైందని చంద్రబాబు నాయుడు అన్నారు. నోట్ల రద్దుతో ప్రజలంతా నష్టపోయారని, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. ‘‘1972 తర్వాత దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. మోదీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు... ఆందోళనకు దిగారు. దేశంలో సహకార వ్యవస్థ ఎక్కడుందని మోదీని సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రధానికి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవు. "
"మేమంతా ఎక్కడ చదువుకున్నామో చెప్పగలం.. మోదీ చెప్పగలరా? రఫేల్ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయి. ప్రధాని మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలి.. త్వరలోనే కుర్చీ దిగుతారు. దేశంలో విపక్ష నేతల చరవాణులను ట్యాప్ చేస్తున్నారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా చేశారు. కేజ్రీవాల్ తన పరిపాలనలో దిల్లీలో అద్భుతాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ను సైతం అడ్డుకున్నారు.. ఎందుకో చెప్పాలి? మోదీ పాలనలో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోయాం. అందరు విపక్ష నేతలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. భాజపా నేతలపై మాత్రం ఒక్క దాడి జరగలేదు. మోదీ అప్రజాస్వామ్య పాలన నుంచి విముక్తి కలిగించేందుకే మేమంతా ఏకమయ్యాం’’ అని చంద్రబాబు వెల్లడించారు.