తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపై కూడా చర్చించబోతున్నారు. చివరి పార్లమెంట్ సమావేశాలు ఇవే అయ్యే అవకాసం ఉండటంతో, ఈ సమావేశాల్లో, మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం పై పెద్ద ఎత్తున ఆందోళన చెయ్యనున్నారు. తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ, వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. తెదేపా ఎంపీలు పార్లమెంటు లోపల, బయట రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెప్పారు.
సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎస్పీవై రెడ్డి, సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ బడ్డెట్ సమావేశాల్లో ఏపీ విభజన హామీలు సహా రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ఎంపీలు గట్టిగా పోరాడాలని చంద్రబాబు సూచించారు. ఏపీని దేశంలో ఒక రాష్ట్రంగా చూడటం లేదని, అన్నింటిలోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ రామ్మోహన్నాయుడు ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. వెనక్కి తగ్గాల్సిన అవసరం తామకు లేదని, సస్పెండ్ చేసినా వెనకాడమని హెచ్చరించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, మిగతా పక్షాలతో రెండు రోజుల్లో సమావేశమవుతామన్నారు. సమావేశాల రోజు తమ ప్రతిఘటన ఉంటుందని రామ్మోహన్నాయుడు తెలిపారు.
ఈవీఎంల అంశంపై ముందు అన్ని పక్షాలతో ఈసీని కలుస్తామని, ఆ తర్వాత న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాల ముందురోజు మిగతా పక్షాలతో సమావేశమవుతామని ఆయన చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని, 2 నెలలు మాత్రమే ఉండే ఎన్డీఏకు సంవత్సరానికి అయ్యే బడ్జెట్ పెట్టే అర్హత ఎక్కడుందని రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. ఏపీకి న్యాయం కోసం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ పోరాటం కొనసాగిస్తామని ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడేది లేదన్నారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన చరిత్ర తమదే అన్నారు. ఈవీఎంలపై కూడా తమ వాదన గట్టిగా వినిపిస్తామని చెప్పారు. సస్పెండ్ చేసినా వెనకాడేది లేదని ఎంపీ అవంతి తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై తమ పోరాటం సాగుతుందని ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. దేశంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కి తీసుకోవడం ఏపీ విషయంలోనే జరిగిందని మండిపడ్డారు. ఏపీపై కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.