దేవినేని అవినాష్ పోటి ఎక్కడి నుంచి...? ప్రస్తుతం ఒక్క బెజవాడ రాజకీయాల్లోనే కాకుండా ఆ ప్రాంత రాజకీయాల మీద అవగాహన ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను, దేవినేని కుటుంబం అభిమానులను తొలచి వేస్తున్న ప్రశ్న. 2017 లో తండ్రి దేవినేని నెహ్రు మరణం తర్వాత అవినాష్ రాజకీయ భవితవ్యంపై అందరికి ఆసక్తి పెరిగిపోయింది. ఆయన ప్రస్తుత౦ పార్టీలో ఒక బాధ్యత నిర్వహిస్తున్నా ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటి చేస్తారు అనేది చర్చనీయంశంగా మారింది. ఈ నేపధ్యంలో పార్టీ వర్గాల్లో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా బలమైన కుటుంబ నేపధ్యం ఉన్న యువ నాయకులను ఎన్నికల్లో నిలపాలని భావిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఎంపీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పరిటాల శ్రీరామ్, కరణం వెంకటేష్, చింతకాయల విజయ్, గౌతు శిరీష, జేసి పవన్ రెడ్డి... వంటి యువ నేతలు తమ తమ ప్రాంతాల్లో సత్తా చాటుతున్నారు. తన తండ్రి ఆశయాల లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం అవినాష్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోనడమే కాకుండా స్థానిక నాయకులను కలుపుకుపోతు వర్గ విభేదాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పార్టీ వర్గాల్లో అవినాష్ పై మంచి అభిప్రాయమే ఉందని తెలుస్తుంది.
ఇక ఆయన పోటి చేస్తారనే ప్రచారమున్న నియోజకవర్గాల విషయానికి వస్తే... ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకత్వం బలహీనంగా ఉన్న కృష్ణా జిల్లాలోని రెండు నియోజకవర్గాలు గుడివాడ, నూజివీడు. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా అవినాష్ ని గుడివాడ నుంచి బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. 2004 నుంచి కొడాలి నాని ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో 2014 లో నియోజకవర్గంలో బలమైన నేతకు టికెట్ ఇచ్చినా ఆయనను ఓడించడం సాధ్యం కాలేదు. ఈ నేపధ్యంలో గుడివాడ నుంచి ఈసారి కృష్ణా జిల్లా రాజకీయాల్లో... యువ సింహంగా పేరున్న అవినాష్ ని బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. గుడివాడ కోటను బద్దలు కొట్టాలి అంటే అవినాష్ సరైన నేత అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అవినాష్ కి యువతలో క్రేజ్ తో పాటు దేవినేని కుటుంబానికి నియోజకవర్గంలో కూడా అభిమానులు ఉండటంతో ఆయన గెలుపుకి కాస్త కష్టపడితే సరిపోతుందని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ కూడా బల౦గానే ఉండటం అవినాష్ కి కలిసి వచ్చే అంశమనే అభిప్రాయం కూడా వినపడుతుంది. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడ బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అనే వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాతో పాటు... పార్టీ వర్గాల్లో లో ఎక్కువగానే వినపడుతున్నాయి.
దీనితో గుడివాడ కోటను బద్దలు కొట్టడానికి అవినాష్ ని ప్రయోగించాలి అనే నమ్మకానికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో మరో నియోజకవర్గం పేరుని కూడా అధినాయకత్వం పరిశీలిస్తుంది. అదే నూజివీడు నియోజకవర్గం. ఇక్కడ పార్టీ క్యాడర్ బలంగానే ఉన్నా టికెట్ కోసం ఆశపడే నేతలు ఎక్కువగానే ఉన్నారు. దానికి తోడు విజయవాడ నుంచి వెళ్ళిన కొందరు అక్కడ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. అదే విధంగా ఎంపీ మాగంటి బాబు వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇక్కడ సీటు ఇస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ తో పాటు దేవినేని అభిమానులు ఉండటం, సరిహద్దు మైలవరం నియోజకవర్గం ప్రభావం కూడా ఉండటంతో అవినాష్ ని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఇక ఆ రెండు కాకపోతే పెనమలూరు సీటు విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కాని ఇక్కడ బోడె ప్రసాద్ కి సీటు ఖరారైనట్టు తెలుస్తున్నా ఆఖరి నిమిషంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటుంది పార్టీ క్యాడర్. ఒక్క పెనమలూరు మినహా నూజివీడు, గుడివాడలో పార్టీకి సమర్ధమవంతమైన నాయకత్వం లేకపోవడంతో వీటిల్లో ఒక దాని నుంచే అవినాష్ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తుంది.