ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, రోజుకి ఒక వార్త ప్రజలను కలవర పెడుతుంది. ముఖ్యంగా 20 రోజులు క్రితం, చంద్రబాబు హయాంలో 55 వేల కోట్లకు ఆమోదించిన పోలవరం అంచనాలు, ఇప్పుడు 20 వేలకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందనే వార్త కలవర పెడుతుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం, కేవలం ఒక లేఖ రాసి, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ గడిపేస్తుంది. అయితే గత వారం మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అదే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారని. దీని పై ఎక్కడ ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినా, ఇప్పటికే దీని పై ఏపి ప్రభుత్వం రివ్యూ చేసింది అంటూ వార్తలు వచ్చయి. ఇలా ఎత్తు తగ్గిస్తే, పోలవరం ఖర్చు భారీగా తగ్గించవచ్చని ప్రభుత్వం ప్లాన్ గా ఉంది. అయితే ఇలా ఎత్తు తగ్గించటం వల్ల, మనం దశాబ్దాలుగా కోరుకున్న పోలవరం ప్రాజెక్ట్ ప్రయోజనం చేకూరదు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు నీరు వెళ్ళాలి, అలాగే విద్యుత్ జనరేషన్ కూడా అనుకున్నట్టు జరగాలి అంటే, పోలవరం ఎత్తు 45.72 మీటర్లకు తగ్గకుండా ఉండాలి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే, 45.72 మీటర్లకు పోలవరం కడుతున్నాం కాబట్టి, తెలంగాణాలో ఉన్న 7 ముంపు మండలాలు, ఏపిలో కలపాలని కేంద్రం పై ఒత్తిడి తెచ్చి సాధించారు. ఇప్పుడు ఎత్తు తగ్గిస్తే, ఆ ముంపు మండలాలతో పని ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నా, ఇప్పటి వరకు ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. మాజీ ఇరిగేషన్ మంత్రి, గతంలో పోలవరం ప్రాజెక్ట్ శ్వాసగా పని చేసిన దేవినేని ఉమా, ఈ ఎత్తు తగ్గింపు వార్తల పై మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన దాని ప్రకారం, జగన్ నడుచుకుంటున్నారని, ఇదేదో ఆషామాషీగా చెప్పటం లేదని, కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అందులో జగన్ తో నేను మాట్లాడానని, పోలవరం ఎత్తు తగ్గిస్తే మా భద్రాచలం కూడా ముప్పు ఉండదు అని జగన్ తో చెప్తే, ఆయన ఒప్పుకున్నారు అంటూ, కేసిఆర్ చెప్పిన మాటల వీడియో ఉమా ప్లే చేసి చూపించారు. తన రాష్ట్రం మునగుకుండా కేసీఆర్ చెప్పిన దానికి జగన్ ఒప్పుకుని, మన రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని, పోలవరం 13 జిల్లాల జీవనాడి అని, 3.57 మీటర్ల వరకు ఎట్టు తగ్గిస్తే, ఎక్కువ నీరు నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉండదని, అలాగే గ్రావిటీ ద్వారా నీరు దూర ప్రాంతాలకు వెళ్ళదని, అటు రాయలసీమకు, ఇటు విశాఖకు కూడా ఇబ్బందని, అలాగే విద్యుత్ కూడా అనుకున్నంత మనం జెనరేట్ చేయలేమని, కేసీఆర్ చెప్పినట్టు కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం నడుచుకోవాలని దేవినేను ఉమా అన్నారు.