పోలవరంలో డయాఫ్రం వాల్ రామోజీరావు కట్టారని ఇరిగేషన్ మంత్రి మాట్లాడటం వింతగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బర్రెలు కాచేవారు కూడా ఇలా మాట్లాడరన్నారు. రామోజీరావు, చంద్రబాబు, రాధాకృష్ణ మీద కోపముందుకని ప్రశ్నించారు. . చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఒక రికార్డు స్థాయిలో 414 రోజుల్లో ఎల్ అండ్ టీ బావర్స్, జర్మనీ సంస్థలచే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మించడం జరిగిందన్నారు. ప్రపంచంలో ఇంతపెద్ద డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎక్కడా లేదు. దేశమే గర్వపడేలా నిర్మించాం. కెల్లార్ లండన్ బేసిస్ కంపెనీ కూడా అభినందించింది. జూన్ 2018లో జాతికి అంకితం చేశాం. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని గాలికొదిలేసింది. అసమర్థ, తెలివితక్కువ నాయకులు అధికారంలోకి రావడంతో ఇలా జరిగింది. జగన్ పోలవరం డ్యామ్ సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడి వారు జగన్ కు మా గురించి వివరించారు. స్పిల్ ఛానల్, అప్రోచ్ పనులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ డిజైన్స్ కు అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అప్రువల్ జరిగింది. పనులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో 71 శాతం పనులు మేం పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ రెండు పక్కల పనులు పూర్తి చేయక వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జగన్ మీడియా ముందుకు రాడు. రామోజీరావు, రాధాకృష్ణలను బూతులు మాట్లాడడానికి మాత్రం మీడియా ముందుకు వస్తారు.
సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం లెప్ట్ కెనాల్ పనులు ఆపేశారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు పక్కన పడేశారు. కేంద్రానికి ఉత్తరాలు రాయడంలో అర్థంలేదు. 22,500 ఎకరాలలో నిర్మితమై 52 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణం. అనిల్ కుమార్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డిలకు వెళ్లి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గేట్ వద్దకు వెళ్లి మాట్లాడే ధైర్యం లేదు. అక్కడికి వెళితే కార్మికులు బట్టలు ఊడదీసి కొడతారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. నేషనల్ హైవేలను దిగ్బంధనం చేస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దని లక్షలాది మంది మద్దతిస్తున్నారు. తాడేపల్లి ప్రాకారానికే ముఖ్యమంత్రి జగన్ పరిమితమయ్యారు. సీబీఐ అంటే జగన్ కు మహా భయం., విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని జగన్ కు మాట్లాడే ధైర్యం లేదు. ఎందుంటే ఈడి కేసులు వెంటాడుతున్నాయి. జైలు భయం, కటకటాలు గుర్తుకొస్తున్నాయి. కార్మికుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుంది. ఈ ఎన్నికల్లో మితిమీరిన దౌర్జన్యాలకు పాల్పడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై దాడి చేశారు. జవీ ఆంజనేయులు కారు మీద రాళ్లతో దాడి చేశారు. విజయవాడలో మహిళలపై దాడులు చేశారు. వీరి అక్రమాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని దేవినేని ఉమా వివరించారు.