ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం అనంతపురం పర్యటన నిమిత్తం, గన్నవరం నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అనంతపురంలోని నీటి పారుదల ప్రాజెక్ట్ పనులు పరిశీలించటానికి వెళ్లారు. ఆయన బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తుండగా ఇది చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ అనంతకు వస్తుండగా కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలని, కారు ఆపాలని దేవినేని తన డ్రైవర్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ కాన్వాయ్ ప్రమాదంలో మంత్రి దేవినేని, డ్రైవర్, ఇతరులు సురక్షితంగా బయటపడ్డారు. సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు. రెండు కార్లు దెబ్బతిన్నాయి... మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరే కారులో అనంతపురం చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీకి అధికారం దక్కలేదన్న బాధతో సీఎం చంద్రబాబునాయుడి పై జగన్ విమర్శలు చేయడం సబబు కాదని అన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించే నేపథ్యంలో కాకుండా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) డైరెక్షన్ లో జగన్ ముందుకు వెళుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను దేవినేని ప్రస్తావించారు. జవనరి 2వ తేదీ నుంచి ‘జన్మభూమి’, ‘మా ఊరు’, ‘ఇంటింటికి టీడీపీ’లో అందిన అర్జీలను పరిష్కరించనున్నట్టు దేవినేని చెప్పారు.