పోలవరం ఇరిగేషన్, పవర్ ప్రాజెక్ట్‌ల వ్యవహారంలో జగన్మోహన్‌రెడ్డి రోజుకో విధంగా చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారని, హైడల్ పవర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాల్సిన ఏపీ జెన్‌కో అధికారులు, మంత్రులు తెల్లమొహాలు వేసుక్కూర్చుంటే, ముఖ్యమంత్రేమో కాంట్రాక్టర్లతో కలిసి కేసీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత, మాజీ మంత్రి, దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ పనులు పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ), కేంద్ర జలవనరుల శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీవీసీ), డ్యామ్‌డిజైన్ రివ్యూప్యానెల్ ఆధ్యర్యంలో జరుగుతుండగా రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ (ఢిల్లీ) రుణసాయంతో, ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో, 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని ఉమా పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి రివర్స్‌టెండరింగ్ పేరుతో డ్రామాలాడిన రాష్ట్ర ప్రభుత్వం, జీవో-67లోని నిబంధనలకు విరుద్ధంగా, సింగిల్ టెండర్‌ను పరిగణనలోకి తీసుకొని, ప్రాజెక్ట్‌నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం, అర్హతలేని 'మెగా' కంపెనీని ఎలా ఎంపిక చేసిందో, ఎవరి ప్రమేయంతో ఎంపిక చేసిందో ఇరిగేషన్, జెన్‌కో అధికారులు, సంబంధిత మంత్రులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యుత్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి టర్బైన్ల పనులన్నీ చివరి దశకొచ్చిన సమయంలో, మరో రెండేళ్లలో విద్యుత్ ఫలాలు రాష్ట్రానికి అందుతున్న వేళ, పోలవరం విద్యుత్ పవర్‌ప్రాజెక్ట్ పనులకు మళ్లీ టెండర్లు పిలిచి, 58నెలల కాలవ్యవధితో వేరేసంస్థకు పనులప్పగించడం, తెలివిగల జగన్‌కే సాధ్యమైందని మాజీమంత్రి దెప్పిపొడిచారు. గతప్రభుత్వంలో పవర్‌ప్రాజెక్ట్ పనులు పొందిన సంస్థ, 2022 ఫిబ్రవరి నాటికి పూర్తిచేస్తామని, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేస్తే, దాన్ని కాదని వేరేసంస్థకు అవేపనులు, ఇంకాఎక్కువ సమయంతో కట్టబెట్టడానికి జగన్మోహన్‌రెడ్డి ఎందుకు ఉవ్విళ్లూరారో సమాధానం చెప్పాలని దేవినేని నిగ్గదీశారు. ఆసంస్థకు ఎక్కువ సమయమివ్వడం వల్ల దాదాపు 15,484 మిలియన్‌యూనిట్లను, యూనిట్ రూ.4 చొప్పున కొనుగోలు చేసినా, 15,484 యూనిట్లకు రూ.6193 కోట్లను రాష్ట్రప్రభుత్వం నష్టపోనుందని ఆయన స్పష్టంచేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి నీటిని ఎలా శ్రీశైలానికి తీసుకెళ్లాలని చర్చిస్తుంటే, సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్‌మంత్రి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
వేమిరెడ్డి, వైవీ.సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి అనే కాంట్రాక్టర్లతో కలిసి జగన్మోహన్‌రెడ్డి జరిపిన చర్చల్లో ఎక్కడా కూడా రాష్ట్రసాగునీటి విభాగం అధికారులుగానీ, విద్యుత్‌శాఖాధికారులు గానీ, సదరు శాఖల మంత్రులుగానీ లేకపోవడం విడ్డూరంగా ఉందని ఉమా చెప్పారు. చర్చల్లో కాంట్రాక్టర్లమయం తప్ప, అధికారులు, మంత్రులు మచ్చుకైనా లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగుగంటలు చర్చించడం జరిగిందన్నారు. వీరంతా కలిసి, గోదావరి నీళ్లను శ్రీశైలానికి తరలిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు గంటలపాటు ఏఏ అంశాలపై చర్చించారో ఎందుకు బహిర్గతం చేయడంలేదన్నారు. ఇరురాష్ట్రాల మధ్యగల విద్యుత్ సమస్యలపై చర్చించారో, తెలంగాణ నుంచి రావాల్సిన రూ.5వేలకోట్ల విద్యుత్ బకాయిల గురించి చర్చించారో, షెడ్యూల్9-10లోని అంశాల గురించా... లేక ఢిల్లీలోని ఏపీభవన్ ఆస్తులగురించి మాట్లాడారో, లేక గోదావరిజలాలు తెలంగాణలో పారించడానికి ఎన్నికిలోమీటర్లు కాలువలు, టన్నెల్స్ తవ్వాలి.. ఆ పనులు రూ.లక్షా40వేల కోట్ల పోలవరంపనుల్ని ఏసంస్థకైతే అప్పగించారో అదేసంస్థకు ఇవ్వడానికి ఆలోచనలు చేశారో జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు చెప్పాలని దేవినేని డిమాండ్‌చేశారు.
ఇవేవీ కాకుండా గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన సాయానికి ప్రతిఫలంగా జగన్మోహన్‌రెడ్డి ఏం సాయం చేయబోతున్నాడని చర్చించారా.. లేక రాబోయే ఎన్నికల గురించి చర్చలు జరిపారో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించాలని ఉమా డిమాండ్ చేశారు. నిన్నటి సమావేశానికి కూడావెళ్లని రాష్ట్ర జలవనరుల మంత్రి, అధికారంలోకి వచ్చి 4 నెలలైనా పోలవరం పనుల్లో ఒక్కబొచ్చె కూడా సిమెంట్ వేయడం చేతగాని ఆయనకు, 30లక్షల క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్ పనులు చేయించిన నాపై ఆరోపణలు చేయడానికి ఏంఅర్హత ఉందని ఉమా ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి పోలవరం వెళ్లినప్పుడు, పనులుచేస్తున్న సంస్థ చాలా స్పష్టంగా 2020కి పనులన్నీ పూర్తి చేస్తామని చెప్తే, లేదు.. లేదు..అలా వద్దు 2021జూన్‌కి పూర్తి చేయాలని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని మాజీ మంత్రి గుర్తుచేశారు. 2017 సెప్టెంబర్‌లో నవయుగ కంపెనీ రూ.3220కోట్లకు పవర్‌ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేస్తామంటే, మెగా ఇంజనీరింగ్ కంపెనీ సంస్థ, రూ.3455 కోట్లకు కడతామని చెప్పడం జరిగిందన్నారు. రూ. 235కోట్లు ఎక్కువ అడిగిన అదే మెగా సంస్థ, 2019 సెప్టెంబర్‌లో రూ.2810 కోట్లకు పనులు చేయడానికి సిద్ధపడటం వెనుక ఉన్న లోగుట్టు ఏమిటో జగన్మోహన్‌రెడ్డి తెలియచేయాలన్నారు.
అప్పటికి, ఇప్పటికీ రూ.645కోట్ల తక్కువకు మెగా కంపెనీ ఎలా టెండర్లు వేసిందన్నారు. రెండేళ్లలో కాళేశ్వరం పనులు చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ పోలవరం హైడ్రోప్రాజెక్ట్ పనుల్ని తక్కువ మొత్తానికి చేయడానికి, అంతే తక్కువకు టెండర్లు వేయడానికి ఎందుకు సిద్ధపడిందో, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గిందో చెప్పాలని ఉమా కోరారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని కేసీఆర్ శాసనసభలో చెప్తే, జగన్మోహన్‌రెడ్డి దాన్ని ఎందుకు ఖండించలేదన్నారు? కేసీఆర్ చెప్పింది తప్పు, దానికి నేను ఒప్పుకోను అని జగన్మోహన్‌రెడ్డి ఎందుకు అనడం లేదని ఉమా నిలదీశారు. పోలవరం జలాలను ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచే రాయలసీమకు, నెల్లూరుకు తీసుకెళ్తామనే మాట జగన్ నోటినుంచి ఎందుకు రావడం లేదన్నారు? కేసీఆర్‌తో లాలూచీపడి గత ఎన్నికల్లో లబ్దిపొందిన జగన్మోహన్‌రెడ్డికి, ఆంధ్రరాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టుపెట్టే హక్కు ఎవరిచ్చారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రూ.235 కోట్లు ఎక్కువ కావాలని అడిగిన మెగా సంస్థ, రాష్ట్రప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1800 కోట్ల పాతబిల్లుల కోసం, ఇప్పుడు జగన్ ఆదేశాలకు అనుగుణంగా తక్కువకు టెండర్లు వేసిందన్నారు. తక్కువకు వేస్తేనే బిల్లులు ఇస్తామని బెదిరించీ మరి, రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీల మెడలు వంచిందన్నారు.
ఎన్నికల్లో పంచినపుస్తకాల్లో , సాక్షి మీడియాలో విషం చిమ్ముతూ, పోలవరం పనుల్లో రూ.20175కోట్ల అవినీతి చేశామని మాపై బురదజల్లిన జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమిచ్చే అవార్డులు తీసుకోవడానికి ఏముఖం పెట్టుకొని వెళతాడని దేవినేని నిలదీశారు. జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగే వారిని పోలవరం పనులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం నియమించడం దురదృష్టకరమన్నారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసి, పోలవరం ప్రాజెక్ట్‌పై 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఇంజనీర్ ఇన్‌చీఫ్ వెంకటేశ్వరరావును జగన్ ఎందుకు తొలగించాడన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు పనులప్పగించడం కోసం, గత ప్రభుత్వంపై బురదజల్లడానికి సహకరించని అధికారులను తొలగించి, తన అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని నియమించడంలోని ఆంతర్యమే మిటని ఉమా ప్రశ్నించారు. విజిలెన్స్ కేసుల్లో ఉన్న అధికారిని పోలవరం డ్యామ్ పనుల్లో ముఖ్యఅధికారిగా నియమించారన్నారు. సింగిల్ టెండర్ విధానంలో, ఏ విధమైన సడలింపులు, వెసులుబాట్లతో మెగా సంస్థకు ఎలా పనులు అప్పగించారో, ఇదే సంస్థ గతంలో రూ.235 ఎక్కువ కావాలని చెప్పి, ఇప్పుడు రూ.645 కోట్లకు తక్కువగా ఎలాటెండర్లు వేసిందో, జలవనరులశాఖ, ఏపీజెన్‌కో అధికారులు స్పష్టం చేయాలన్నారు.