రాష్ట్ర సాగునీటి చరిత్రలో గడిచిన తెలుగుదేశం ఐదేళ్ల పాలన స్వర్ణయుగంగా నిలిచిపోతుంది. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు గారు ఇరిగేషన్ శాఖలో రూ. 63,373 కోట్లు ఖర్చు చేయగా.. చివరి ఏడాదిలో కూడా రూ.13,988 కోట్లు వెచ్చించారు. మేజర్, మైనర్, మీడియం ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టు, డెల్టా మోడ్రనైజేషన్, ఫ్లడ్ బ్యాంక్, నీరు-చెట్టు.. ఇలా అన్ని పనులలో కలిపి రూ.63,373 కోట్లు ఖర్చు చేయడమైనది. తెలుగుదేశం హయాంలో 62 సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించగా.. 23 ప్రాజెక్టులు పూర్తిచేయడమైనది. 26 ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ లో ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్న మాచర్ల లిఫ్ట్ వరికశలపూడి కూడా తెలుగుదేశం హయాంలో 61 ప్రాజెక్టుగా చేపట్టడం జరిగింది. గోదావరి-పెన్నా అనుసంధానం మొదటి ఫేజ్ కూడా టెండర్లు పిలిచి.. పల్నాడు ప్రాంతంలో చంద్రబాబు గారి చేతులమీదుగా శంకుస్థాపన చేయడంతో పాటు పనులు కూడా ప్రారంభించాం. వైకాపా అధికారంలోకి వచ్చిన 12 నెలల్లో ఆ పనులన్నింటినీ రద్దు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన 62 ప్రాజెక్టుల వల్ల 20,19,053 ఎకరాల కొత్త ఆయకట్టు, 45,09,124 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు వస్తుంది. వైకాపా నాయకులు పట్టిసీమను ఒట్టిసీమ అన్నారు, అధికారంలోకి రాగానే పట్టిసీమ పంపులు పీకేస్తామన్నారు. ఇప్పుడు అదే పట్టిసీమ వారికి దిక్కయింది. ప్రతిపక్షంలో ఉండగా పట్టిసీమకు భూములను ఇస్తున్న రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైకాపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. 12 నెలల్లో పట్టిసీమను పూర్తిచేశాం. 8.8 టీఎంసీలతో తొలి ఏడాదే 2,500 కోట్ల పంటను కాపాడాం. పట్టిసీమతో నాలుగేళ్లలో రూ. 44వేల కోట్ల ఉత్పాదక శక్తి జరిగింది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు.
గడిచిన ఏడాదిలో శ్రీశైలం ప్రాజెక్టుకి 8 సార్లు వరద వచ్చినా.. 800 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. పులిచింతలలో 45 టీఎంసీలు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ.. 30 టీఎంసీలు కూడా నిలబెట్టలేకపోయారు. కనీసం పులిచింతల నుంచి గ్రావిటీతో నీళ్లు తెచ్చుకుని నారుమళ్లు కూడా కాపాడలేని దౌర్భగ్య స్థితి కల్పించారు. ఇది మీ చేతగానితనం కాదా..? కృష్ణా-గుంటూరు జిల్లాలలోని వైకాపా ఎమ్మెల్యేల అనుచరులు నదిలో అడ్డంగా రోడ్లు వేసి మరీ పందికొక్కుల్లా ఇసుకను తవ్వేస్తున్నారు. వారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు..? పట్టిసీమ నీరు మీద చల్లుకొని అయినా మీ పాపాలు కడుక్కోండి. ఏడాది కాలంలో పూలసుబ్బయ్య వెలిగొండ సొరంగం-1 పనులు పూర్తిచేస్తామని గత బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ ఏడాది పాలనలో పూర్తిచేయలేకపోయారు. టన్నెల్ 1, 2 పనులలో అవినీతి జరిగిందని ఆరోపించారు. టన్నెల్ 2 పనులలో రివర్స్ టెండరింగ్ కి పిలిచి.. తిరిగి టన్నెల్ 1 చేసే వారికే అప్పగించారు. తెలుగుదేశం హయాంలో పోలవరం ప్రాజెక్టులో 24 గంటల్లో 32,434 క్యూ.మీ. కాంక్రీట్ వేసి.. గిన్నీస్ రికార్డు సాధించాం. కానీ వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో.. నెలల తరబడి ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేసి.. చిత్తూరు వరకు నీరు తీసుకెళ్తామన్నారు. ఏడాది కాలంలో ఎంత పనులు జరిగాయో..? ఎన్ని లక్షల క్యూ.మీటర్ల కాంక్రీట్ పని జరిగిందో చెప్పగలరా..? సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టులో ఏడాది కాలంలో ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా..? 2019-20 లో రూ.13,139 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించి.. ఏడాదిలో రూ.4,941 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో మీ అనుయాయులకు ఎంత చెల్లించారు..? ఖర్చు పెట్టిన బడ్జెట్ పై చర్చ జరపకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు పారిపోయారు..? ఏడాది కాలంలో చేసిన పనులు చెప్పుకోలేక కరోనాను అడ్డం పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలలో చర్చలు లేకుండా చేశారు. సమాధానం చెప్పకుండా బుగ్గన పలాయనం చిత్తగించారు, ఇరిగేషన్ మంత్రి బూతులకే పరిమితమయ్యారు. కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి అయినా 5 కోట్ల మంది ఆంధ్రులకు సమాధానం చెబుతారా..?
ఏడాది కాలంలో ప్రభుత్వ కార్యాలయాలకు, స్మశానాలకు రంగులు వేసిన ప్రభుత్వం.. చివరకు బడ్జెట్ పుస్తకాలకు కూడా ఆ రంగులు పులిమింది. 2020-21 బడ్జెట్ లో సాగునీటి రంగానికి ఒక్క పేజీ కూడా కేటాయించలేకపోయారు. చివరకు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు మీ పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటు. ప్రకాశం బ్యారేజీ ఎగువన 10 టీఎంసీల నీరు నిలబెట్టే.. వైకుంఠపురం బ్యారేజీ పనులని బుద్ధిలేకుండా క్యాన్సిల్ చేశారు. పెన్నా నదిలో వైకాపా రాబంధుల ఇసుక దోపిడీ వల్ల వందల అడుగుల లోతున ఉన్న శివాలయం బయటపడింది. మూడు పాయలుగా గోదావరి జలాలను శ్రీశైలం తీసుకెళ్తానన్న జగన్మోహన్ రెడ్డికి.. ఏడాది తర్వాత జ్నానోదయం అయింది. ఇప్పటికీ ఆయనకు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన పనులు కనిపించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగునీటి రంగానికి బడ్జెట్ లో తక్కువగా రూ. 11,805 కోట్లు కేటాయించారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించి.. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. రైతులు కన్నీళ్లు పెడుతున్నా.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.1,246 కోట్ల బకాయిలు చెల్లించడం లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి బూతులు తిట్టడమే తప్ప.. ఆయనకు రైతులకు బకాయిలు చెల్లించాలన్న ఆలోచన లేదు. సుబాబుల్ రైతులను పట్టించుకోవడం లేదు.
పొగాకు రైతును దోపిడీ చేస్తున్నారు. పసుపు కొనే పరిస్థితి లేదు. దళారులు మిర్చి రైతును దోచేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్ల నుంచి.. 12 నెలల్లో కనీసం రూ. 700 కోట్లు ఖర్చు చేయలేదు. పెట్టిన ఖర్చు కూడా ఎక్కడ వెచ్చించారో చెప్పలేని స్థితిలో ఉన్నారు. కోర్టులంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లెక్కలేదు. రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్ మీడియాపై కూడా దాడులు చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పినందుకు టీవీ 5 నాయుడు గారిని, జర్నలిస్ట్ మూర్తిని సీఐడీ కార్యాలయానికి పిలిపించి బెదరించే ప్రయత్నం చేశారు. మీ నిర్వాకాల వల్ల పోలీస్ ఉన్నతాధికారుల నుంచి చీఫ్ సెక్రటరీ వరకు కోర్టు బోనులో నిలబడే పరిస్థితి వచ్చింది. సీఆర్డీఏ రద్దు బిల్లును శాసనసభలో మరలా ప్రవేశపెట్టడంతో.. మనోవేధనతో చిలకా సాంబశివరావు అనే అమరావతి రైతు గుండెపోటుతో మరణించారు. రాజధానిలో 66 మంది రైతులు చనిపోతే.. కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా వారిని పరామర్శించారా..? ప్రజారాజధాని అమరావతిని కాపాడుకోవడం కోసం 185 రోజులుగా వారు చేస్తున్న ఉద్యమం మీ కళ్లకు కనిపించడం లేదా..? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ధైర్యముంటే.. మండలిలో జరిగిన వీడియో ఫూటేజీని బయటపెట్టాలి. అప్పుడే మంత్రులు మాట్లాడిన బూతు పదజాలం, తెలుగుదేశం సభ్యులను ఎగిరెగిరి తన్నిన దృశ్యాలు చూసి ప్రజలు వాస్తవాలను గ్రహిస్తారు.