జగన్ వెలిగొండ పర్యటన చూస్తుంటే, హాస్యాస్పదంగా ఉందని, ముఖ్యమంత్రి చేసిన సమీక్షలోనే వెలిగొండ ఒకటో టన్నెల్ పనులు 90.96 శాతం పూర్తయ్యాయని, 17.78కిలోమీటర్ల వరకు టన్నెల్ బోరింగ్ పనులుపూర్తయ్యాయని, మొత్తం 18.798 మీటర్లలో 17.78కి.మీటర్ల వరకు పూర్తయినట్టు రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆయనే స్వయంగా వెలిగొండ టన్నెల్ పూర్తిచేసినట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. నిన్నటివరకు హోంమంత్రిగా పనిచేసిన సజ్జల, ఉన్నట్టుండి సరికొత్తగా జలవనరులశాఖ మంత్రి అవతారం ఎప్పుడు ఎత్తాడో తెలియడంలేదని దేవినేని ఎద్దేవాచేశారు. ప్రతిపక్షంపై, ప్రశ్నించినవారిపై అక్రమకేసులు పెట్టేలా జగన్ ఆదేశిస్తుంటే, సజ్జల వాటిని తూచాతప్పకుండా అమలయ్యేలా చూస్తున్నాడన్నారు. శుక్రవారం సాయంత్రం బెంగుళూరుకు వెళ్లి, సోమవారం ఉదయాన్నే తిరిగొచ్చేసే సజ్జల, పలుమార్గాల్లో అందినకాడికి దండుకుంటున్నాడన్నారు. సజ్జల ఎవరినుంచి ఎంతెంత వసూలుచేస్తున్నాడో, డమ్మీ మంత్రులను అడిగితే మొత్తం చెబుతారని, ఆ కలెక్షన్ పనులేవో సక్రమంగా చేసుకోకుండా, టన్నెల్స్, ప్రాజెక్టులు అంటూ తెలియనివాటి గురించి సజ్జల మాట్లాడటం, జగన్ కామెడీ చేయడం చూస్తుంటే నవ్వోస్తోందని దేవినేని దెప్పిపొడిచారు.

1989 మార్చిలో మహానుభావుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు, అప్పట్లో తన ఓఎస్ డీగా ఉన్న డాక్టర్ శ్రీరామకృష్ణయ్యను ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్టప్రాంతాలన్నీ తిప్పి, వెలిగొండ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 1996లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న, ఆర్థిక ఇబ్బందులను తొలగింపచేసి, నిర్మాణం కొనసాగేలా పరిపాలనా ఉత్తర్వులిచ్చి, పనులు మొదలయ్యేలా చూశారన్నారు. వెలిగొండ టన్నెల్ పనులు త్వరగా పూర్తయితే, తన సొంత జిల్లాకునీళ్లొస్తాయని తెలిసికూడా, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్ట్ పనులు, కాలువల పనులకు గ్రహణం పట్టించాడన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి చేసిన అవినీతిని కడగటానికి భయపడి, జీవోనెం 13ని తీసుకొచ్చికూడా ప్రాజెక్ట్ పనులను గాలికొదిలేశారన్నారు. చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులు తిరిగి కొనసాగించడం కోసం, సాగునీటి రంగనిపుణలతో ఒక కమిటీవేసి, జీవోనెం ­­22, జీవోనెం 63లు తీసుకురావడం జరిగిందని దేవినేని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి నిర్ణయాలకారణంగా సాగునీటి ప్రాజెక్ట్ లు ఆనాడు సాగునీటి ప్రాజెక్ట్ లు చేపట్టిన కంపెనీలన్నీ, ఐసీయూలోకి చేరాయన్నారు.

వెలిగొండ ప్రాజెక్ట్ లో, టన్నెల్ 1 లో 4.4 కిలోమీటర్ల పనులను గత ఐదేళ్లలోనే పూర్తి చేశామని, కొత్త ఏజెన్సీ వచ్చాక జరిగిన 2కిలోమీటర్ల పనుల గురించి మాట్లాడుతూ, కేవలం 600 మీటర్ల పనులే టీడీపీ హాయాంలో జరిగాయని చెబుతూ, వైసీపీప్రభుత్వం, సజ్జల వంటి నేతలు అబద్ధాలతోనే బతుకుతున్నారని దేవినేని దుయ్యబట్టారు. వెలిగొండ టన్నెల్ పనులు చేపట్టిన మొదటి ఏజెన్సీ నాలుగన్నరేళ్లలో 3.8కిలోమీటర్ల పనులు చేస్తే, రెండో ఏజెన్సీ పనులు చేపట్టాక 2 కిలోమీటర్ల పనులు చేసిందని, ఈ వాస్తవాలు చెప్పకుండా, టీడీపీ ప్రభుత్వం కేవలం 600 మీటర్లే పనులు చేసిందని సజ్జల ట్వీట్లు పెట్టడం, ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనమన్నారు. జగన్ ఆడిన రివర్స్ డ్రామాలన్నింటిపై కచ్చితంగా సీబీఐ విచారణ జరిగి తీరుతుందని, తప్పుచేసిన అధికారులంతా శ్రీలక్ష్మి మాదిరిగా, కోర్టుల చుట్టూ తిరగడం ఖాయమని ఉమా స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డి తనపార్టీ వారితో రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి రాబోతున్నట్టు ట్వీట్ కూడా ఇప్పించాడని, ఆమెవరో, ఎందుకొస్తుందో కాలమే సమాధానం చెబుతుందని దేవినేని తెలిపారు. జగన్ , ఆయన బృందం తప్పుడుకూతలను, సాక్షి తప్పుడురాతలను తట్టుకొని, పనులు చేయడంపైనే తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

అచ్చెన్నాయుడిని తట్టుకోలేకనే..... బడుగు, బలహీన వర్గాలకు వెలుగులాంటి వాడైన స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి వచ్చిన కింజరాపు అచ్చెన్నాయుడన్నా, రామ్మోహన్ నాయుడన్నా జగన్ కు భయమని దేవినేని ఎద్దేవాచేశారు. ఆరడుగులు అచ్చెన్నాయుడి రూపం, పదేపదే జగన్ కలలోకి కూడా వస్తోందని, ఆ రూపాన్ని తట్టుకోలేకనే, ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడిని చూసి భయపడే, జగన్ పదేపదే అతని రూపం గురించి మాట్లాడుతుంటాడన్నారు. అసెంబ్లీలో బడుగు, బలహీనవర్గాల గురించి మాట్లాడుతున్నాడన్న అక్కసుతోనే అచ్చెన్నాయుడిపై అవినీతి బురద జల్లాలని చూస్తున్నారన్నారు. ప్రధానమంత్రి ఆదేశాలతో టెలీహెల్త్ సేవలను కొనసాగిస్తే, దాన్ని తప్పపడుతూ, పవిత్రమైన శివరాత్రి పర్వదినాన అచ్చెన్నాయుడిపై బురదజల్లాలని చూడటం, వైసీపీప్రభుత్వానికే చెల్లిందన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను, అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు, జగన్ ప్రభుత్వాన్ని ఒక ఆట అడుకుంటాడన్నారు. లోకేశ్ ఆస్తులు ప్రకటన చేసి, సవాల్ విసిరితే, జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలానే తోకముడిచాడన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read