ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి నోటి దురదతో, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు చేతి దురదతో జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటూ చరిత్ర హీనులుగా మారవద్దని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70వ సారి పోలవరంపై సోమవారం వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌తో పనులు వేగవంతంగా జరిగేలా చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్‌లో, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో కూర్చుని పోలవరం పనులు ఏమీ జరగలేదనటం హాస్యాస్పదమన్నారు.
2019 ఫిబ్రవరి-మార్చి లోపు పోలవరం పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లుతుందన్నారు. దశాబ్ద కాలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1.14 శాతం మాత్రమే పోలవరం డ్యామ్ సైట్‌లో పనులు జరిగితే గత నాలుగు సంవత్సరాలలో మా ప్రభుత్వ హయాంలో 43 శాతం పనులు జరిగాయన్నారు. అందుకే నేను కాల్వల్లో మట్టి పనులు చేసి మట్టికొట్టుకుపోయారు తప్ప డ్యామ్ సైట్‌లో ఏమీ చేయలేదని చెపుతున్నానన్నారు. జలయజ్ఞం… ధనయజ్ఞంగా మార్చి మీ తండ్రి హయాంలో అవినీతికి పాల్పడటంతో పదహారు నెలలు చంచలగుడా జైలులో ఉండి పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటలేదని మాట్లాడటం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు. పోలవరం ప్రాజెక్టు ను చూసి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు కాని అవగాహనలేకుండా మాట్లాడితే తగిన బుద్ది చెపుతారని అయినా పోలవరం ప్రాజెక్టు పై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 57.14 శాతం పూర్తికాగా, స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు 76.44 శాతం, డయాఫ్రం వాల్ పనులు 100 శాతం, రేడియల్ గేట్ల పనులు 67 శాతం, ఎగువ జట్ గ్రీటింగ్ పనులు పూర్తికాగా, దిగువ జెట్ గ్రీటింగ్ పనులు గోదావరి ప్రవాహం తగ్గిన తర్వాత మొదలు పెట్టి పూర్తి చేస్తామన్నారు. పోలవరం కుడి కాలవ 90 శాతం, ఎడమ కాలువ 62.61 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇంత వేగంగా జరుగుతుంటే పునాదులు పడలేదని విమర్శించడం ప్రతిపక్ష నేత జగన్ అహంకారానికి నిదర్శనం అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులు బాగా జరుగుతున్నాయని తెలిపారన్నారు.
ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు ను ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా రైతులు, యువత, జర్నలిస్టులు, రైతు కూలీలు కలిపి 78,963 మంది 1,579 బస్సుల ద్వారా 105 రోజుల్లో సందర్శించగా ఇంకా ఎన్నో లక్షల మంది వారి సొంత వాహనాల్లో సందర్శిస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్నాయని, వారం వారం సోమవారం పోలవరం వివరాలు అందిస్తుంటే వీరికి స్వేతపత్రం కావాలంటూ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం నిర్వాసితులను రెచ్చగొట్టాలని ప్రతిపక్షనేత కుతంత్రాలు, కుట్రలు పన్నుతున్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.14,488 కోట్లు ఖర్చుచేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.9,352 కోట్లు ఖర్చు చేయగా, కేంద్ర ప్రభుత్వం రూ.6,727 కోట్లు రీఇంబర్స్ చేసిందని, రూ.2,625 కోట్లు ఇంకా రావాల్సి ఉందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఐదు నియోజకవర్గాలలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తుంటే కనీసం ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడకపోవటం శోచనీయమన్నారు. ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్‌కు 187 టీఎంసీల నీళ్లు తేవడం భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మా జీవితాలు మారిపోతాయని రైతులందరూ భావిస్తుంటే నీ అనుయాయులు ద్వారా సుప్రీం కోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేస్తూ ఇబ్బందులు సృష్టిస్తుంటే, ఈ కేసులు పరిష్కారానికి అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు.
గోదావరి నది నుంచి పట్టిసీమ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజికి 28.6 టీఎంసీల నీటిని తీసుకురాగా, గోదావరి డెల్టాకి 53.6 టీఎంసీలు నీటిని వాడుకున్నామన్నారు. కృష్ణా డెల్టాలో 6 లక్షల ఎకరాలకు, గోదావరి డెల్టాలలో 10 లక్షల ఎకరాలకు నీటి వసతి కల్పించామని, వేసిన ప్రతిపంటను కాపాడటానికి చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఇప్పటి వరకు గోదావరి నది నుంచి 591 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయన్నారు. ఇవాళ్ల హైకోర్టులో కృష్ణా డెల్టా కి వృధాగా సముద్రంలోకి వెళ్లే నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి తెస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష నేత జగన్ రాజన్న కాబినెట్ లో పనిచేసిన మంత్రి చేత కేసు వేయించారన్నారు. 59 ప్రాజెక్టులు చేపట్టగా 9 ప్రాజెక్టులు ఇప్పటికే జాతికి అంకితం చేయగా ఇంకా 6 ప్రాజెక్టులు పూర్తయ్యాయని 28 ప్రాజెక్టులు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు వస్తున్నాయని, అక్కడకు వచ్చిన నీటిని రాయలసీమ ప్రాంతాలకు వాడుకుంటామన్నారు. జగన్ ప్రజలను నమ్మించి అధికారంలోకి రావాలనే కాంక్షతో పోలవరంతో ప్రాజెక్టు పై మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. జలవనరుల శాఖకు ప్రతిష్టాత్మక అవార్డు.. రాష్ట్ర జలవనరుల శాఖకు గ్లోబల్ వాటర్ కన్జర్వేషన్ అవార్డు-2018వ సంవత్సరానికి దక్కిందన్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు ఢిల్లీలో జరగనున్న ప్రపంచ వాటర్ సమ్మిట్లో ఈ అవార్డు ప్రధానం చేయనున్నారన్నారు. ఈ అవార్డుకు 29 రాష్ట్రాలు పోటీపడితే మన రాష్ట్రానికి ఈ అవార్డు దక్కటం మన సామర్థ్యానికి గుర్తింపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల కష్టానికి నిదర్శమన్నారు. గత ఏడాది ఈ అవార్డు టాటా స్టీల్ దక్కించుకుందన్నారు. రాష్ట్రంలో 15 శాతం వర్షపాతం తక్కువ పడగా, రాయలసీమలో -45 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా 19 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని వాటికి సకాలంలో నీటిని అందించడమే కాకుండా పంటను కాపాడుకునే విధంగా పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు.