వైసీపీ అధినేత జగన్ ‘బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే వ్యాధితో బాధపడుతున్నారని రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నిత్యం భ్రమల్లో మునిగితేలడం, ఏవేవో ఊహించుకోవడం, అంతా తానే అన్నట్టు.. సీఎం అయిపోయినట్టు భ్రాంతి చెందడం సదరు వ్యాధి లక్షణాలని పేర్కొన్నారు. మానసిక వ్యాధి నిపుణుడు లేదా కుటుంబ వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆదివారం విజయవాడలోని జలవనరుల విడిది కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘‘ఆ వ్యాధి లక్షణాలున్న వ్యక్తులు ఏదేదో ఊహించుకుని సీఎం అవుతాననే భ్రమలో ఉంటారు. మంత్రిగా, శాసన సభ్యుడిగా తమ్ముడికి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది."
"కోడికత్తి ఘటనలో బాధ్యత గల ప్రతిపక్ష నేతగా సంబంధిత అధికారులకు సహకరించకుండా చేతులు ఊపుకుంటూ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో పడుకొని జగన్నాటకానికి తెరతీశారు. మొదటి సంవత్సరం ప్రభుత్వం ఉండదని, రెండో సంవత్సరం బంగాళాఖాతంలో కలపమని, మూడో సంవత్సరం చెప్పులు వేయమని చెప్పిన జగన్ నాల్గవ సంవత్సరం కోడికత్తి డ్రామా ఆడుతున్నాడు.జగన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారా అని విచారిస్తే... జగన్‌లాంటి వ్యక్తులు బోర్డర్ లైన్ పర్సనాలిటి డిజార్డర్ వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఒక భ్రాంతిలో ఉంటారని, వారు చెప్పిందే జరగాలని అనుకుంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారని తేలింది’’ అని మంత్రి దేవినేని దుయ్యబట్టారు.
రాజమహేంద్రవరంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, ‘‘వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆడిన కోడి కత్తి డ్రామా ప్రజలందరికీ అర్థమయింది. దాడి జరిగి 20 రోజులు అయ్యాక జగన్ నోరిప్పాడు. వైసీపీ కోడికత్తి నాటకాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సీబీఐలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సీబీఐను వ్యతిరేకించాయి. తాజాగా మమతా బెనర్జీ కూడా వ్యతిరేకించారు’’ అని అన్నారు. ‘ప్రజల్లో విశ్వసనీయత తగ్గింది. ఈ నేపథ్యంలో సానుభూతి కోసం వైఎస్ జగన్ పాకులాడుతున్నాడు. అర సెంటీమీటర్ గాయమైంది. చేతులూపుకుంటూ విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ తరువాత పెద్ద గాయమైనట్లు, హత్యాయత్నం జరిగిందని ఆస్పత్రిలో చేరి డ్రామాకు తెరలేపారన్నారు. చంద్రబాబు ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు. సీబీఐని అడ్డంపెట్టుకుని కేంద్రం కుట్రలు పన్నుతోంది. అత్యున్నత స్థాయిలో ఉన్న సీబీఐని దేశంలో నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ వద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని అనంతపురంలో మండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్ అన్నారు.