సోమవారం మొత్తం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ సమావేశాల్లో బిజీబిజీగా గడిపిన మంత్రి దేవినేని ఉమా, సమావేశాల అనంతరం రాత్రికి బయలుదేరి హైదరాబాద్ వచ్చి, మంగళవారం ఉదయం హైదరాబాదు నుండి విజయవాడ రావలసి ఉన్నది. కానీ సమావేశాల అనంతరం మంత్రి దేవినేని ఢిల్లీ నుంచి హైదరాబాదుకు రాత్రి 9 గంటలకు చేరుకొని, హైదరాబాదులోని తన నివాసానికి కూడా వెళ్లకుండా నేరుగా కారులో బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో పొంగిపొర్లుతున్న ఎర్ర కాలువను రైట్ మెయిన్ కెనాల్, 50వ కిలో మీటర్ వద్ద పరిశీలించారు.
రాత్రి రెండు గంటలకు అనంతపల్లి కి చేరుకున్న మంత్రి దేవినేని ఎర్ర కాలవ ముంపునకు గురైన అనంతపల్లి లో స్వయంగా తిరిగి పునరావాస ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎర్ర కాలువ వరదతో ముంపునకు గురై నీళ్లమయమైన చోడవరం గ్రామంలో తిరగటానికి వీలు లేకపోతే, నడుము లోతు నీళ్ళలో సైతం మంత్రి దేవినేని తిరుగుతుంటే స్థానికులు ఒక ట్రాక్టర్ ను తీసుకువచ్చి దానిపై ఎక్కమని మంత్రి దేవినేనిని కోరారు. అనంతరం ట్రాక్టర్ పై గ్రామం మొత్తం తిరిగి పరిశీలించి స్వయంగా పునరావాస ఏర్పాట్లలో మంత్రి పాల్గొన్నారు.
మంత్రి దేవినేని తోపాటు పశ్చిమగోదావరి కలెక్టర్ భాస్కర్, ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు, గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. రాత్రి మొత్తం పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దేవినేని ఉదయం బయలుదేరి విజయవాడ వెళ్ళారు. కొసమెరుపేంటంటే మంత్రి దేవినేని తీరుకు అలవాటైన ఆయన సిబ్బంది, ఎప్పుడు ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. కానీ అటువంటి సిబ్బంది ఆలోచనికి కూడా అందని రీతిలో మెరుపువేగంతో, ఏ సిబ్బంది లేకుండా డిల్లీనుండి రాత్రికి రాత్రే పశ్చిమగోదావరి జిల్లాలో, మంత్రి చేసిన పర్యటన ఉదయం తెలుసుకున్న సిబ్బంది అవాక్కయ్యారు.