రాష్ట్రంలో అమరావతి చుట్టూ రాజకీయం నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళే ముందు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసి, అమరావతికి నిధులు ఇవ్వక పోయినా పరవాలేదు , అమరావతిని కొన్నాళ్ళు పక్కన పెట్టి, ఆ నిధులు మిగతా వాటికి ఇవ్వండి అంటూ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి అమరావతి పై మొదలైన రగడ, మంత్రి బొత్సా వ్యాఖ్యలతో, తారా స్థాయికి చేరింది. అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా అని ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, అమరావతి నిర్మాణానికి ఎక్కువ డబ్బులు అవుతాయని, ప్రజా ధనం వృధా చెయ్యటం మాకు ఇష్టం లేదని, అందుకే రాజధాని అమరావతి పై, రాష్ట్ర ప్రభుత్వం తరుపున త్వరలోనే పూర్తీ ప్రకటన చేస్తామని బొత్సా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కు పెట్టాయి.
ఒక పక్క బొత్సా చేసిన వ్యాఖ్యలు, హాట్ టాపిక్ గా మారితే, మరో పక్క ఇదే అంశం పై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా, అంతకు మించిన హాట్ గా మారాయి. అమరావతి పై జగన్ ఎదో కుట్ర చేస్తున్నారని, దేవినేని ఉమా, నెల రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే అమెరికా వెళ్ళే ముందు ప్రధాని మోడీ, అమిత్ షా ని కలిసి, అమరావతి పై ఒక వినతి పత్రం ఇచ్చారని, అది ఏమిటో బయట పెట్టాలని దేవినేని ఉమా డిమాండ్ చేసారు. ప్రధాని మోడీ, అమిత్ షా లను కలిసిన సమయంలో అమరావతి గురించి ఏమి మాట్లాడుకున్నారు ? జగన్ ఇచ్చిన లేఖలో ఏముందో ప్రజలకు చెప్పాలి అంటూ దేవినేని ఉమా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో, బొత్సా చేసిన వ్యాఖ్యలతో, దేవినేని ఉమా చేస్తున్న ఆరోపణలు నిజం అయ్యాయి.
దీంతో దేవినేని ఉమా, బొత్సా వ్యాఖ్యల తరువాత, మరో బాంబు పేల్చారు. దీంతో వైసిపీలో దేవినేని ఉమా వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్ళే ముందే, కడప జిల్లాకు చెందిన ఒక కీలక వైసిపీ నేతను తన వద్దకు పిలిపించుకుని, దోనకొండలో భూములు కొనుక్కోవాలని సూచించారని, దేవినేని ఉమా ఆరోపించారు. ఆ నేతకు టికెట్ ఇవ్వని కారణంగా, ఈ విధంగా అయినా ఆయనకు ఆర్ధికంగా లబ్ది చేకూర్చటానికి, జగన్ ప్లాన్ చేసారని, ఇది అబద్ధమని జగన్ చెప్పగలరా అని దేవినేని ఉమా ఛాలెంజ్ చేసారు. దీంతో, ఆ నేత ఎవరు అనే విషయం అటు టిడిపి పార్టీలోనూ, అటు వైసీపీలోను ఆసక్తి నెలకొంది. నిజంగానే జగన్ చెప్పరా, నిజం అయితే చెప్పండి, మేము కూడా అక్కడ భూములు కొనుక్కుంటాం అంటూ, కొంత మంది వైసిపీ నేతలు కూడా దేవినేని ఉమాకు ఫోన్ చేసి వాకబు చేస్తున్నారు అంట. మొత్తానికి, అమరావతి పై గందరగోళ పరిస్థితి పెట్టి, దొనకొండ చుట్టూ రియల్ భూం తేవటంలో మాత్రం వైసీపీ సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి.