గతంలో తెలుగుదేశం పార్టీపై ఒక అపవాదు ఉండేది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండగా, తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాజకీయాలు మర్చిపోయిందని, కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై మాత్రమే వారు ఫోకస్ చేసారని, ఇది ఆసరాగా తీసుకుని, ప్రత్యర్ధి పార్టీలు, పైడ్ టీమ్స్ పెట్టి మరీ, తెలుగుదేశం పార్టీ పై, అధినాయకత్వం పై తప్పుడు ప్రచారాలు చేసే వారని, తెలుగుదేశం ఓటమికి ఇది ప్రధాన కారణంగా చెప్తూ ఉంటారు. సింగపూర్ హోటల్ దగ్గర నుంచి, అమరావతి మొత్తం ఒకే సామాజికవర్గం దాకా తెలుగుదేశం పార్టీ పై ప్రతి అంశంలో బురద చల్లుతూ ఉంటారు. టిడిపి గట్టిగా రియాక్ట్ అవ్వక పోవటంతో, ప్రజలు కూడా ఇదే నిజం అని నమ్మే వారు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత, తమ తప్పులు సమీక్షించుకున్న టిడిపి, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారి పని పట్టింది. ఓడిపోయిన మొదట్లోనే, లోకేష్ 25 లక్షల చిరు తిండి తిన్నాడు అంటూ, సాక్షి ఒక కధనం వేసింది. అసలు సాక్షి వేసిన తేదీల్లో లోకేష్ వివిధ పర్యటనల్లో ఉన్నారు, దీంతో ఆధారాలు అన్నీ చూపించి, లోకేష్ కోర్టులో పరువు నష్టం దావా వేసారు. ఇదే ఒరవడి టిడిపి కొనసాగిస్తుంది. తాజాగా, లోకేష్ స్టాన్ఫోర్డ్ లో చదువుకుంటానికి, చంద్రబాబు దగ్గర డబ్బులు లేక, రామలింగరాజు చేత డబ్బులు ఖర్చు పెట్టించారు అంటూ, కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే.
దీంతో వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మొత్తం, నిజాలతో పని లేకుండా, ఇవే కధనాలు వండి వార్చారు. గ్రేట్ ఆంధ్రా అనే వెబ్ సైట్ కూడా, లోకేష్ చదువు గురించి తప్పుడు కధనం ప్రచురించింది. దీంతో తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. ఆ తప్పుడు కధనం పై డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఆ యూనివర్సిటీ ఇచ్చిన లేఖలు, లోకేష్ తల్లి భువనేశ్వరి ఎకౌంటు నుంచి, కట్టిన ఫీజ్ వివరాలు, ఇలా మొత్తం ఆధారాలు డీజీపీకి ఇచ్చి, తప్పుడు కధనాలు రాసిన గ్రేట్ ఆంధ్రా పై చర్యలు తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఫిర్యాదు చేసింది. వైసీపీకి అనుకూలంగా, తప్పుడు కధనాలు ప్రచారం చేస్తున్న వివిధ మాధ్యమాలను ఈ సందర్భంగా టిడిపి హెచ్చరించింది. ఇక నుంచి తప్పుడు కధనాలు రాస్తే ఎవరినీ ఉపేక్షించం అని హెచ్చరించారు. స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీలో ఎలా సీట్ వస్తుందో కూడా తెలియకుండా చదవు లేని కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడితే, దాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లి, కధనాలు వండి వార్చిన వారి పై, న్యాయ పోరాటం కూడా చేస్తాం అని హెచ్చరించారు.