వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ సొంత ప్రభుత్వ పని తీరు పైనే, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో వస్తున్న ప్రజా వ్యతిరేకత, తమ మీద పాడుకుందా, వైసీపీ ఎమ్మెల్యేలు కొంత మంది జాగ్రత్త పడుతూ, తమ ప్రభుత్వం పైనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే బాటలో, ఇప్పుడు ధర్మాన ప్రసాద్ కూడా, ప్రజల్లో ఉన్న ప్రజా వ్యతిరేకత, తన మీద పడకుండా జాగ్రత్త పడుతూ, ముందుకు వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరులో ఆనం, శ్రీకాకుళంలో ధర్మాన, అడపా తడపా తమ ప్రభుత్వం పైనే, చురకలు వేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ధర్మాన ప్రసాద్ రావు, నిన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అనే వార్తల నేపధ్యంలో, ధర్మాన ఇలా ప్రభుత్వం పైనే వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. ఆయన మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో, పేదలకు ఎంతో ఉపయోగకరమైన నరేగా పథకాన్ని సరిగ్గా అమలు చేయలేక పోతున్నాం అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం చేపట్టిన అనేక పనులు, ఎందుకు మనం పూర్తి చేయలేక పోతున్నాం అని విశ్లేషిస్తే, అనేక విషయాలు తమ ముందుకు వస్తున్నాయని అన్నారు.
ఒక పని చేయటానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ కానీ, ఒక ఏజెన్సీ కాని, వారు ఈ రాష్ట్రంలో పడుతున్న ఇబ్బంది, సిమెంట్ ఎక్కువ ధరకు దొరుకుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం అని చెప్పిన, సిమెంట్ సరఫరా సరిగ్గా జరగటం లేదని అన్నారు. అలాగే స్టీల్ కూడా, బయట మార్కెట్ లో ఎక్కువ ధర ఇస్తే, ప్రభుత్వం తక్కువ ధర ఇస్తే ఎలా అని అన్నారు. ఇక ఇసుక కూడా బయట మార్కెట్ లో ఎక్కువ ఉంటే, మనం తక్కువ ఇస్తాం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇవన్నీ సరిగ్గా లేవని అన్నారు. పంతానికి పోయిన కొంత మంది పనులు చేసి, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు లోనవుతున్నారని అన్నారు. ప్రభుత్వం పనులు చేస్తున్న వారు నష్టపోతున్నారని, నష్టాల్లో ఉంటున్నారని అన్నారు. నష్టాలు వస్తుంటే ఎవరు పనులు చేస్తారని ప్రశ్నించారు. ఇవన్నీ మారాలని అన్నారు. వాస్తవికంగా ఉండాలని అన్నారు. తప్పుడు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వద్దు అని అన్నారు. కొంత మంది అధికారులు తీరు వల్లే ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. మరి ఈ వ్యాఖ్యల పై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.