అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందకు లేఖ రాసారు. అయితే దీని పై, తెలుగుదేశం పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ధర్మాన పై మండి పడుతూ, తెలుగుదేశం పార్టీ, మీడియాకు ఒక లేఖ విడుదల చేసింది. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు లేఖ రాయడం ద్వారా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. సీనియర్ శాసనసభ్యుడు రాయవలసిన లేఖేనా ఇది. నారాయణ కమిటీ ఎందుకు వేశారో కూడా తెలుసుకోకుండా, కనీసం ఆ జీఓని చదవకుండా రాష్ట్రపతికి లేఖ రాశారు. శివరామకృష్ణణ్ కమిటీ నివేదికను కూడా ధర్మాన చదవకుండా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని ఏకంగా రాష్ట్రపతికి లేక రాశారంటే ఆయన తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు."
"అంతటి రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడంలో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పాత్ర కూడా ఉంది. దానికి ధర్మన ఏం చెబుతారు? ఆ పార్టీ మంత్రులు, నేతలు రాజధాని అమరావతి నుంచి తరలించం అని చెబుతున్నారు. ధర్మాన అది రాజ్యాంగ విరుద్ధం అని రాష్ట్రపతికి లేఖ రాశారు. రాజధానికి ఏం కావాలో శివరామకృష్ణణ్ కమిటీ స్పష్టంగా చెప్పింది. ఆ ప్రకారం రాష్ట్రానికి మధ్యన, రోడ్లు, నీరు...... వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనువైన అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజధాని నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. "
"ఆ తరువాత రాజధాని అమరావతిని రాష్ట్రపతి కూడా సందర్శించారు. రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ఆమోదంతో హైకోర్టు ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్కడి హైకోర్టుని ప్రారంభించారు. దేశ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చారు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్దంగా భావించాలా? దాదాపు పది వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి శాసనసభ, సచివాలయం, హైకోర్టు భవనాలు నిర్మించారు. అనేక రోడ్లు వేశారు. ఇంకా అనేక భవనాలు, రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలోనూ నాలుగున్నరేళ్లుగా పాలనంతా ఇక్కడ సజావుగా సాగుతోంది. ఈ పరిస్థితులలో ధర్మాన ఈ విధంగా లేఖ రాశారంటే వైసీపీ విధానాలు, ఆ పార్టీ నేతలు ఎలా ఉన్నారో ప్రజలు అర్ధం చేసుకోవగలరు."