రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, విభజన చట్టంలోని అంశాల సాధన కోసం తెదేపా పోరాట తీవ్రతను పెంచినప్పుడల్లా, దాన్ని దెబ్బతీసేందుకు తమ లాలూచీపరులతో భాజపా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. శనివారం తెదేపా ఒంగోలులో ధర్మపోరాట దీక్ష చేస్తుంటే, అదే రోజు భాజపా మరో పార్టీతో మరోచోట పోటీ దీక్షలు చేయిస్తోందన్నారు. ఇదంతా ఆ మూడు పార్టీలు కలిసి తెదేపాని దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, వైకాపా, జనసేనల లాలూచీ రాజకీయాలు బయటపడ్డాయని, ప్రజలన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి శుక్రవారం తెదేపా ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటులో ఎంపీలు అద్భుతంగా పోరాడారని, ప్రజల నుంచీ ప్రశంసలు అందుకుంటున్నారని కితాబిచ్చారు. ఇక ముందూ ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పార్లమెంటుకి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినందున ఎంపీలంతా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘‘కేంద్రానికి మన సంపద, వనరులు కావాలి. మనకిచ్చిన హామీలను మాత్రం నెరవేర్చరు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయరు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’’ అని ఆయన సూచించారు.
ఒంగోలులో జరిగే ధర్మపోరాట సభకు ఎంపీలంతా హాజరవ్వాలన్నారు. భవిష్యత్తు పోరాటానికి మరింత ఉత్తేజం పొందాలన్నారు. రాష్ట్రానికి న్యాయం చేసేంత వరకు భాజపాని విడిచిపెట్టే ప్రసక్తి లేదని సీఎం వ్యాఖ్యానించారు. భాజపాదే యూటర్న్ అని, తెదేపాది ఎప్పుడూ రైట్ టర్న్ అన్న విషయాన్ని ఎంపీలు గట్టిగా చెప్పాలన్నారు. ‘‘వెనుకబడిన జిల్లాల కోసం ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కు తీసుకోవడం యూటర్న్ కాదా? మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడం, రాజస్థాన్ పెట్రో కాంప్లెక్స్‌కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను సగానికి తగ్గించి, కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌కు మాత్రం మమ్మల్నే రూ.5,615 కోట్లు కట్టమనడం యూటర్న్ కాదా? దిల్లీ-ముంబయి కారిడార్‌కో న్యాయం, విశాఖ-చెన్నై కారిడార్‌కో న్యాయమా? ధొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి అమరావతికి అన్యాయం చేయడం యూటర్న్ కాదా?’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నీ ప్రజలకు వివరించాలను ఎంపీలకు సూచించారు.