నిన్న చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. తాడిపత్రిలో వైసీపీ నేతల చేతులో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా, ధర్మవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో మాట్లాడుతూ, ధర్మవరం నియోజకవర్గం పై కీలక ప్రకటన చేసారు. కొద్ది రోజుల క్రితం, ధర్మవరం నియోజకవర్గం టిడిపి బాధ్యతలు చూసే వరదాపురం సూరి, పార్టీ మారి, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఇంచార్జ్ కోసం, కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతుంది. ఈ నేపధ్యంలో ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు, ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు, పరిటాల కుటుంబానికి అప్పచేప్తున్నాం అని, వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ప్రకటించారు. చంద్రబాబు అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ, రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల బాధ్యతలు పరిటాల కుటుంబానికే ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఈ నియోజకవర్గ బాధ్యతలు పరిటాల సునీత చుసుకుంటుందో, పరిటాల శ్రీరామ్ తీసుకుంటారో, వారి నిర్ణయానికే వదిలేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. పరిటాల కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా, చంద్రబాబు సమక్షంలోనే, పరిటాల సునీత బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. మొన్నటి దాక ఇక్కడ ఉన్న ఒక నాయకుడు, ఇదే ధర్మవరంలో తమను రావటానికి, మాట్లాడటానికి కూడా అవకాశమివ్వలేదని, ఇప్పుడే అదే మనిషి పార్టీని విడిచిపెట్టి వెళ్లాడన్నారు. ఎవరూ ఉన్నా లేకపోయినా, పరవాలేదని, కొందరు వస్తుంటారు, పోతుంటారని, వారి గురించి పట్టించుకోనవసరం లేదని, పార్టీ ముఖ్యమని అన్నారు. చంద్రబాబు గారి మాటే మాకు వేదం అని, చంద్రబాబు గారు చెప్పినట్టు, మేము చర్చించుకుని, ధర్మవరంలో ఎవరు ఇంచార్జ్ గా ఉండాలో, అధినేత ద్రుష్టికి తీసుకువచ్చి, ఆయన నిర్ణయం ప్రకారం, ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.