సంగం డైరీ పాలక వర్గం పై మరో కేసు నమోదు అయ్యింది. సంగం డైరీ పాలకవర్గం, గత నెల 24వ తేదీన చైర్మెన్ ధూళిపాళ్ల నరేంద్ర అధ్యక్షతన విజయవాడలో ఒక హోటల్ లో సమావేశం నిర్వహించారు. ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పై విడుదల అయిన తరువాత, ఆయన పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండటంతో, ఈ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇది పక్కన పెడితే, ఇప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి కోపం తెప్పించిది. ఎపిడమిక్ డిసీజ్ ఆక్ట్ నిబంధలకు విరుద్ధంగా, కర్ఫ్యూ నిబంధనలకు విరుద్దంగా ధూళిపాళ్ల నరేంద్ర ఈ సమావేశం ఏర్పాటు చేసారని, విజయవాడ పటమట ఎస్ఐ కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధూళిపాళ్ల నరేంద్ర పై కేసు నమోదు చేసారు. అలాగే పాలక వర్గం సమావేశం ఏర్పాటు చేసిన హోటల్ లో ఉన్న సిసిటీవీ ఫూటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ సెక్రటరీకి నోటీసులు ఇవ్వటంతో, విజయవాడ పటమట ఎస్ఐ దగ్గరకు విచారణ నిమిత్తం హాజరు అయ్యారు. అయితే మధ్యానం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపు ఉండటంతో, ఆయనను ఇంకా వదిలి పెట్టలేదని, ఇంకా ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ, సంగం డైరీ ప్రతినిధులు పోలీసులు తీరుని ప్రశ్నిస్తున్నారు.
అయితే సంగం డైరీ పాలక వర్గం పై కేసు పెట్టటంతో, కంపెనీ ప్రతినిధులు స్పందించారు. సంగం డైరీ పాలక వర్గం మీటింగ్ లో, కేవలం 12 మంది డైరెక్టర్ లు మాత్రమే అదీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి పాల్గున్నారని, ఇందులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అవకాశమే లేదని, వాపోతున్నారు. పాలక వర్గంలో ఉన్నది కేలవం 12 మంది మత్రమే అని, ఆ 12 మందితో మాత్రమే సమావేశం నిర్వహించామని, పోలీసులు స్వాధీనం చేసుకున్న హోటల్ సిసిటీవీ ఫూటేజ్ లో కూడా ఇదే విషయం ఉంటుందని, కావాలి అంటే అది పోలీసులు చుసుకోవచ్చని అంటున్నారు. ఈ కేసుని కావాలనే తమ పై మోపారని, సంగం డైరీ అధికారులు చెప్తున్నారు. డైరీ పాలక వర్గం సమావేశం వెంటనే నిర్వహించాల్సి ఉండటం, డైరీకి సంబందించిన పాలనాపరమైన, అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో, ఈ సమావేశం నిర్వహించామని చెప్తున్నారు. అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా ఏమి చేయకుండా, ధూళిపాళ్ల నరేంద్ర ని మళ్ళీ టార్గెట్ చేయటం పై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.