ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేసిన పనికి, మిగతా అన్ని రాష్ట్రాల విషయంలో కూడా అలెర్ట్ అవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అతితో, దేశానికి ఇబ్బందులు వస్తున్నాయని, దేశం పరువు పోయే పరిస్థితి, దేశానికి పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని, కేంద్రం గ్రహించింది. 2019లో అధికారంలోకి రాగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మొదటి పని, గతంలో చంద్రబాబు హయాంలో చేసుకున్న సోలార్ - విండ్ ఉత్పత్తి కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు సమీక్ష చేయటం. అయితే ఇలా ఎప్పుడు జరగలేదని, ఒక కంపెనీ పెట్టే సమయంలో ఎన్నో అలోచించి పెట్టుబడి పెడతాం అని, ప్రభుత్వాలు మారిన ప్రతి సారి, ఒప్పందాలు సమీక్షిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే ఎలా అంటూ, పెట్టుబడి దారులు ఎదురు తిరిగారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడి దారులు, ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం చెప్పారు. తమ దేశ రాయబారులు చేత, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు కూడా. జపాన్ లాంటి దేశాలు అయితే, ఒక రాష్ట్రం చేస్తున్న తప్పుకు, మీ దేశంలోనే పెట్టుబడులు పెట్టాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి అని కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసాయి. మిగతా కొన్ని కంపెనీలు కోర్టుకు కూడా వెళ్ళాయి. ప్రభుత్వాలు మారిన ప్రతి సారీ, మేము ఒప్పందాలు సమీక్ష చేస్తాం అంటే అంతకంటే మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు అంటూ కేంద్రం కూడా రాష్ట్రాలకు హెచ్చరించింది.
ఇక పెట్టుబడులు సదస్సుకు దావోస్ వెళ్ళిన సమయంలో, అక్కడ కొంత మంది పెట్టబడి దారులు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు ఈ ఒప్పందాల సమీక్షల వల్ల ఎలా నష్ట పోతుంది ఫిర్యాదు చేసారు. మొత్తానికి ఇవన్నీ చూసిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల వైఖరి విషయంలో, సరి కొత్త వ్యూహంతో ముందుకు వస్తుంది. తాజాగా అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం, అన్ని రాష్ట్రాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వ ఒప్పందాలు సమీక్షించటం కుదరదు అని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పెట్టుబడిదారులకు హామీ ఇవ్వాలని, అన్ని రాష్ట్రాలకు ఒక ఎంవోయూ ముసాయిదా పంపించింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల పెట్టుబడులకు ఎంతో కృషి చేస్తుంటే, రాష్ట్రాల వైఖరితో నష్టం వస్తుందని తెలిపింది. ఒప్పందాలు సమీక్ష చేస్తాం అంటే, పెట్టుబడి దారులు ఎలా వస్తారని ప్రశ్నించింది. ఈ కొత్త ఎంవోయూతో, ఒక కాలం పరిధి వరకు విధానాలను మార్చుకోవటానికి వీలు ఉండదు. అలాగే గత ప్రభుత్వాలు పెట్టుబడి దారులకు ఇచ్చిన హామీలు, కొత్తగా వచ్చే ప్రభుత్వాలు మార్చటానికి ఉండదు. మొత్తానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు చేయకుండా, గట్టి ఏర్పాటు చేస్తుంది.