ఎన్నికల్లో తెదేపాదే గెలుపని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే తెదేపాను గెలిపిస్తాయని ఆయన అన్నారు. ఈ మేరకు అమరావతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేపట్టినన్ని సంక్షేమ పథకాలు ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. 120 సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఒక్కరైనా అభినందించారా అని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోవట్లేదని, పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛనే లేకపోతే మా గతి అథోగతయ్యేదని జేసీ అన్నారు.
మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాయని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చుపెట్టారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల మొత్తం ఖర్చు రూ.50 కోట్లు దాటిందన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించాలనేది తన తపన అని వివరించారు. ఇందుకోసం ఓ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులతో కలిసి ఈ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక ముందు ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. డబ్బు కాదు.. చేసిన పనులను ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే పరిస్థితి రావాలన్నారు. అందుకోసం కృషి చేస్తానని వివరించారు.
ఇటీవల టీడీపీ గెలుపుపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు అదృష్టవంతుడు. ఎందుకని ఆయన నన్ను అడిగారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేయడమే అదృష్టానికి కారణం. నిన్న క్యూలో అమ్మవార్లు, వృద్ధులు విరగబడి వచ్చారు. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలపడానికే వాళ్లు వచ్చారు. అనంతపురం లోక్‌సభలో అందరినీ మార్చమని నేనే చెప్పా. మార్చకపోతే గెలవం అని చెప్పాను. అయినా మార్చలేదు. మార్చకపోయినా గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయే. అనంతపురం టౌన్, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నాం. రాసిపెట్టుకోండి.. మే 23వ తేదీన చూడండి’’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.