మన సొంత రాష్ట్రంలో ఉన్న నాయకులు, బీజేపీ పై మాట పడకుండా, ఇవ్వ వలిసిన వారిని కనీసం ఒక్క మాట కూడా అనకుండా, బీజేపీ మీద పోరాడుతున్న వారిని బలహీనపరిచే ప్రయత్నాలు చూస్తున్నాం. మరో పక్క, పక్క రాష్ట్రాల నాయకులు మాత్రం, మనం చేసే దీక్షలకు వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఉక్కు ప్యాక్టరీ కేటాయించాలంటూ కేంద్రం తీరుకు నిరసగా టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు పొరుగు రాష్ట్రాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. సీఎం రమేష్ చేపట్టిన దీక్షకు తమిళనాడులో ముఖ్య పార్టీయైన డీఎంకే మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత కనిమొళి నేడు కడపకు రానున్నారు. సీఎం రమేష్‌కు సంఘీభావం తెలపనున్నారు.
ఇదిలాఉండగా, దీక్ష కారణంగా సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్యం నానాటికి విషయమిస్తోందని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో వీరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం దీక్షల్లోని ఎంపీ, ఎమ్మెల్సీని రాష్ట్ర మంత్రి జవహర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వాసు కలిసి మద్దతు తెలిపారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తే ఎన్టీయేలోని భాజపా నమ్మించినట్టేట ముంచేసిందన్నారు. జిల్లాకు చెందిన జగన్మోహన్‌రెడ్డి తన కేసుల మాఫీ కోసం పాకులాడుతూ ఉక్కు గురించి మాట్లాడటంలేదన్నారు. జనసేన అంటూ గాలిపోగేసుకుంటున్న ఓ నటుడు చంద్రబాబు, లోకేష్‌ను తిడుతున్నారని భారతదేశ చరిత్రలో నీతి వంతపాలన, పరిపాలనాధక్షుడుగా పేరెన్నిగన్న చంద్రబాబును తిట్టడంలో అర్థంలేదన్నారు.
మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ 120 గంటల పాటు ఆహారం లేకుండా ఉన్నవీరి పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తించాలన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కోరుతున్నా కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే సుమారు రెండు లక్షలమందికి ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని, అవి రావడం ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి ఇష్టంలేదన్నారు. ఉక్కు పరిశ్రమపైన, ప్రత్యేక హోదాపైన కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి తమ పరిధికి మించి మాట్లాడుతున్నారని, నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రకాశ్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉక్కుపై ఒక్క ప్రకటన చేస్తే వీరిద్దరూ దీక్ష విరమిస్తారని అన్నారు. రాష్ట్ర గవర్నర్ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అర్థంలేకుండా దొంగదీక్షలని మాట్లాడటం తగదని అన్నారు.