తెలుగుదేశం పార్టీ ఎంపీలు సోమవారం చెన్నైలోని డీఎంకే ఎంపీ కనిమొళిని కలిశారు. మోదీ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కనిమొళిని కలిసిన ఎంపీల్లో సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మురళీ మోహన్ ఉన్నారు. నవ్యాంధ్ర సమస్యల పరిష్కారం, విభజన చట్టం హామీల అమలులో కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ చంద్రబాబు రాసిన లేఖను కనిమొళికి అందజేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎలా అన్యాయం చేసిందో టీడీపీ ఎంపీలు వివరించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారని... వారికి తాము అండగా నిలుస్తామని చెప్పారు. ఒక బలమైన నేతను మీ హక్కుల కోసం పోరాడుతున్నారు, జాగ్రత్త, ఈ పోరాటంలో మా మద్దతు మీకే అంటూ ఆమె అన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ఎవరితోనూ సంప్రదించకుండా యూపీఏ ఏకపక్షంగా వ్యవహరించింది. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలను బీజేపీ కాలరాస్తోంది. ఏపీపై ఇంత నిర్లక్ష్యమా? మాకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నాం. గత నాలుగేళ్లుగా కేంద్రం ఏం ఇచ్చిందీ, ఇవ్వాల్సిందీ వివరాలివిగో.. ఓ రాజకీయ పార్టీగా మీరు ఆలోచించి మద్దతివ్వండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కనిమొళికి అందచేసారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రకటించే అవిశ్వాసానికి మద్దతు కోరుతూ ఆదివారం పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు, ముఖ్యమంత్రులకు ఆయన రాసిన 8 పేజీల లేఖ రాసారు.
విభజన సందర్భంగా 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదు. అశాస్ర్తియ పద్ధతిలో విభజన జరిగింది. ఏకపక్షంగా తలుపులు మూసేసి బిల్లును ఆమోదించారు. విభజన చట్టం 11వ యాక్టులో 8వ షెడ్యూల్ ప్రకారం రాజ్యసభలో ఆరు ప్రధానమైన హామీలు ఇచ్చారు. ఇవి అమలు చేయటంలో కూడా కేంద్రంలోని బీజేపీ తాత్సారం చేస్తోంది’ అని ఆయన ఆరోపించారు. షెడ్యూల్ 8 ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ అయిల్ రిఫైనరీ - పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ, విజయవాడ విమానాశ్రయాల విస్తరణ, తిరుపతికి అంతర్జాతీయ స్థాయి కల్పించటంతో పాటు నూతన రాజధాని నుంచి హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు రైల్, రోడ్డు రవాణా అనుసంధానం, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖపట్నం, విజయవాడ మెట్రోరైలు సదుపాయాలు కల్పించాల్సి ఉంది. షెడ్యూల్ 9 ప్రకారం 89 స్థిర, చరాస్తులు, షెడ్యూల్ 10 ప్రకారం 142 జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సంబంధించి ఇప్పటికీ పంపకాలు జరగలేదు. రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఆరు ప్రధాన హామీలకు సభలో ఉన్న పార్టీలే సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ప్రత్యేక హోదా ప్రకటించారు. ఈ అంశాన్ని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సీమాంధ్ర ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చిందని ఆయన వివరించారు.